Layoffs | బెంగళూరు: భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఎన్నడూ లేని సంక్షోభం నెలకొంది. ఈ టెక్ హబ్ ప్రస్తుతం తీవ్ర ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. వ్యయ నియంత్రణ చర్యలతో పాటు ఆటోమేషన్, కృత్రిమ మేధ కారణంగా ఐటీ సెక్టార్లో చాలా సంస్థలు సామూహిక తొలగింపులు చేపడుతున్నాయి. 2024లో సుమారు 50 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ఇన్షార్ట్స్లోని ఒక నివేదిక తెలిపింది. గత ఏడాది అర లక్ష మందిని తీసేశారని, ఈ ఏడాది ఎంతమందిని ఇంటికి పంపుతారో అర్థం కావడం లేదని ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంక్షోభ ప్రభావం హౌసింగ్, రియల్ ఎస్టేట్, స్థానిక వ్యాపారాలపైనా పడనుంది. రానున్న కొన్ని వారాలు, నెలల్లో ఐటీ సంస్థల్లో లేఆఫ్‌లు తీవ్రంగా ఉంటాయని భావిస్తున్నారు.
లేఆఫ్‌ల్లో ఎక్కువగా బాధితులుగా మిగిలేది దిగువ స్థాయి ఉద్యోగులే. ఆటోమేషన్, ఏఐ సంక్షోభం కారణంగా చేపట్టే కాస్ట్ కటింగ్‌లలో మొదట బలయ్యేది వీరే. వీరిలో ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామర్లు, సాఫ్ట్వేర్ టెస్టర్లు అధికంగా ఉంటారు. వీరి స్థానాలను ఏఐ భర్తీ చేస్తుంది. కోడింగ్, డీబగ్, సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ వంటి పనులన్నీ పూర్తి సామర్థ్యంతో, అతి తక్కువ ఖర్చుతో ఏఐ ద్వారానే చేపడతారు. ‘చాలామంది టెక్ ఉద్యోగులు ఆటోమేషన్ అన్నది సుదీర్ఘ ముప్పు అని గుర్తించడంలో విఫలమవుతున్నారు. దీంతో ప్రాథమికంగా అది ఉపాధి దృశ్యాన్నే మార్చేస్తుంది’ అని ప్రముఖ కంపెనీ హెచ్ఆర్ హెడ్ ఒకరు తెలిపారు.
లేఆఫ్‌ల ప్రభావం తొలుత బెంగళూరులో పీజీ అకామిడేషన్లు, రెంటల్ మార్కెట్, తక్కువ అద్దెలుండే ఇండ్లపై పడుతుంది. చిన్న చిన్న ఉద్యోగుల్లో చాలామంది ఈ పీజీ అకామిడేషన్లలోనే ఉంటున్నారు. వారి ఉద్యోగాలు పోతే ఇవి కూడా ఖాళీ అవ్వడం ఖాయం. ఇప్పటికే పలువురు యజమానులు వీటిపై పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టి నెలసరి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పుడు వీటికి డిమాండ్ తగ్గితే ఆదాయం పడిపోవడంతో పాటు, ఆస్తుల విలువ కూడా తగ్గిపోతుందని, యజమానులు ఆందోళన చెందుతున్నారు. టెక్ పార్కులు, కార్పొరేట్ కార్యాలయాలకు హాట్ స్పాట్ లాంటి ఔటర్ రింగ్ రోడ్‌కు సమీపంలో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టిన వారు కూడా హడలిపోతున్నారు. భవిష్యత్తులో బెంగళూరు ఉజ్వలంగా ఉంటుందని భావించి దీర్ఘకాలం రెంటల్ ఆదాయం పొందే ధ్యేయంతో ఇప్పటికే ఇక్కడి వెంచర్లపై కోట్లాది రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు. నిరుడు లేఆఫ్‌ల వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గుతూ వస్తున్నది. బెంగళూరు ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన ఐటీ ఇండస్ట్రీకి సవాళ్లు ఎదురైతే అది పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.