IndiGo flight : ఇటీవలి కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో విమానాల రాకపోకలు, ప్రయాణాలకు ఆటంకం కలుగుతోంది. తాజాగా బెంగళూరు-ఢిల్లీ విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఇండిగో సంస్థకు చెందిన విమానానికి ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విమానం శనివారం సాయంత్రం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరాల్సి ఉంది.
కొద్దిసేపట్లో విమానం టేకాఫ్ కావాలి. అప్పటికే ప్రయాణికులంతా విమానంలో కూర్చుని ఉన్నారు. ఇదే సమయంలో విమానంలోని వాష్ రూమ్‌లో ఒక టిష్యూ పేపర్‌పై బాంబు బెదిరింపు నోట్ కనిపించింది. ఈ విమానంలో పేలుడు పదార్థం ఉందని ఆ నోట్లో ఉన్నట్లు ఒక ప్రయాణికుడు గమనించాడు. ఈ విషయాన్ని విమానం సిబ్బందికి తెలిపాడు. దీంతో పైలట్లు ఈ విషయాన్ని ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)కు చెప్పారు. సమాచారం అందుకున్న అధికారులు, భద్రతా సిబ్బందితో వచ్చి ప్రయాణికుల్ని విమానం నుంచి దింపివేశారు. ప్రయాణికులు సహా విమానం అంతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేదని తేల్చారు.
ఇదంతా అబద్ధమే అని వెల్లడించారు. అనంతరం ప్రయాణికులు విమానంలో తిరిగి ఎక్కారు. తర్వాత విమానం ఢిల్లీ బయల్దేరింది. ఢిల్లీకి విమానం సురక్షితంగా చేరుకుంది. అయితే, ఈ బెదిరింపు నోట్‌పై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఇలా, అనవసర బెదిరింపులకు పాల్పడిన మైసూరుకు చెందిన ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇప్పటివరకు 1,100 బాంబు బెదిరింపులకు పాల్పడ్డట్లు గుర్తించారు.