బెంగళూరు : కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తున్నాయి. దీంతో కొత్త బోరు బావుల తవ్వకానికి అనుమతులివ్వడాన్ని అధికారికంగా నిలిపేశారు. బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి వారం రోజుల నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరించడం మానేసింది.
ఈ ఏడాదంతా భూగర్భ జలాల స్థాయులను పరిశీలిస్తామని చెప్పింది. మండుటెండలు కమ్ముకొస్తున్న తరుణంలో ఈ పరిస్థితి పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాల ఊట సామర్థ్యం పరిమితంగా ఉన్నప్పటికీ, వాటిని అత్యధికంగా తోడేస్తున్నారు. భూగర్భ జలాల స్థాయులు దారుణంగా పడిపోయినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) తెలిపింది. దీంతో బోర్డు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదిలావుండగా, తాగునీటిని దుర్వినియోగం చేసేవారిపై బోర్డు కొరడా ఝళిపిస్తున్నది.