కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జ్యోతిప్రియా మాలిక్‌కు కోల్‌కతాలో మనీల్యాండరింగ్ కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ప్రజాపంపిణీ స్కీమ్‌లో జరిగిన స్కామ్‌లో 14 నెలలుగా మాలిక్ జైలుశిక్ష అనుభవించారు. 50 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరు 25వేల బాండ్‌పై సాక్షి సంతకాలు చేసిన తర్వాత బెయిల్ మంజూరీ చేశారు. 2023 అక్టోబర్ 27వ తేదీన మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది. రేషన్ షాపులకు పంపిన ఆహారధాన్యాలను.. అక్రమమార్గంలో దారి మళ్లించి, వాటిని మార్కెట్లో అమ్ముకున్నట్లు మాజీ మంత్రి మాలిక్‌పై ఆరోపణలు ఉన్నాయి.
2023, డిసెంబర్ 12వ తేదీన మాలిక్‌పై ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణకు సహకరించాలని మాలిక్‌కు కోర్టు చెప్పింది. ప్రతి రోజు కోర్టుకు హాజరుకావాలని పేర్కొన్నది. మొబైల్ నెంబర్ ఇవ్వాలని, పాస్‌పోర్టును సరెండర్ చేయాలని ఆదేశించింది. సాక్ష్యులను ప్రభావితం చేయరాదు అని పీఎంఎల్ఏ కోర్టు హెచ్చరించింది. ఆహార, సరఫరాల శాఖకు 2011 నుంచి 2021 మధ్య మాలిక్ మంత్రిగా చేశారు.