కోల్కతా, అక్టోబర్ 29: బెంగాల్ బీజేపీలో అసమ్మతి తారాస్థాయికి చేరిందా? పార్టీలో కొత్తగా చేరినవాళ్లనే అధిష్ఠానం అందలం ఎక్కిస్తున్నదా? ఏండ్లుగా నమ్ముకొని ఉన్న వారిని పక్కనబెట్టారా? అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆ రాష్ట్ర పార్టీ జనరల్ సెకట్రరీ సయంతన్ బసు రాసిన లేఖ అవునని నిరూపిస్తున్నది. పార్టీలో పాతవాళ్లను పట్టించుకోవటం లేదని, కొత్తవాళ్లకే పదవులు ఇస్తున్నారని ఆయన అసంతృప్తిని వెళ్లగక్కారు. బెంగాల్లో బీజేపీ పరిస్థితి దారుణంగా తయారవుతున్నదని తెలిపారు. నడ్డాకు రాసిన లేఖలో.. ‘పార్టీ సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉన్నది. 1980-2019 మధ్య లక్షల మంది కార్యకర్తలతో నిర్మించిన పార్టీ.. ఇప్పుడు 2019, 2020లో చేరిన ఐదారుగురి చేతుల్లోకి వెళ్లిపోయింది. మమతా బెనర్జీపై ఉన్న అసమ్మతిని బీజేపీ క్యాష్ చేసుకోలేకపోతున్నది’ అని పేర్కొన్నారు. సయంతన్ వ్యాఖ్యలు సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకొనేనని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.