న్యూఢిల్లీ: భారతీయ వాతావరణ శాఖ(IMD) ఇవాళ వర్షాకలం వానల గురించి అప్డేట్ ఇచ్చింది. నైరుతీ రుతుపవనాల వల్ల దేశవ్యాప్తంగా ఈసారి సాధారణం కంటే తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారత్‌లో నైరుతీ రుతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు కురిసే విషయం తెలిసిందే. వర్షం మీద ఆధారపడే అనేక వ్యవసాయ ప్రదేశాల్లో ఈసారి తక్కువ వర్షపాతం ఉంటుందని ఐఎండీ తన నివేదికలో చెప్పింది.
ఇక జూన్ నెలలో అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, చత్తీస్ఘడ్, గుజరాత్, ఏపీతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో హీట్‌వేవ్ ఉంటుందని ఐఎండీ తెలిపింది. రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కన్నా తక్కువ స్థాయిలో హీట్‌వేవ్ నమోదు అయ్యింది. అయితే వాతావరణ మార్పులను పరిశీలిస్తే, ఎల్ నినో లాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యే రీతిలో ఉందని ఐఎండీ తెలిపింది. ఎల్ నినో వల్ల వర్షకాలం డిస్టర్బ్ అవుతుంది, దీని వల్ల తక్కువ స్థాయిలో వర్షం పడుతుంది, కరువు పరిస్థితులు పెరిగే అవకాశం ఉన్నది.
మే 16వ తేదీన నైరుతీ రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. అయితే మే 28వ తేదీ నాటికి అవి దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్, బంగాళాఖాతం ప్రాంతాలకు అడ్వాన్స్ అయ్యాయి. అండమాన్ నికోబార్‌తో పాటు అండమాన్ సముద్రం మొత్తాన్ని కవర్ చేశాయి. అయితే ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు బలహీనంగా ఉన్నాయని, రాబోయే నెలల్లో బలపడే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొన్నది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా వరకు దేశవ్యాప్తంగా సాధారణం కన్నా తక్కువ వర్షం ఉంటుందని, కానీ ఈశాన్య, నార్త్‌వెస్ట్ ప్రాంతాల్లో మాత్రం అధిక వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ తెలిపింది. సెంట్రల్ ఇండియా, ఈస్ట్ ఇండియా ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో వర్షం నమోదు కానున్నది.
నైరుతీ రుతుపవనాల వల్ల మాన్సూన్ కోర్ జోన్లో నార్మల్ కన్నా తక్కువ వర్షాలు నమోదు అవుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృతు్యంజయ మహాపాత్ర తెలిపారు. వర్షాధారిత వ్యవస్థాయ ప్రాంతాలన్నీ మాన్సూన్ కోర్ జోన్లో ఉంటాయి. జూన్ నెలలో దేశవ్యాప్తంగా వర్షపాతం తక్కువ ఉంటుందని ఐఎండీ చెప్పింది. అనేక ప్రాంతాల్లో ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు ఐఎండీ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నార్మల్ కన్నా ఎక్కువగా నమోదు కానున్నాయి. తక్కువ వర్షపాతం వల్ల వ్యవసాయం, నీటి లభ్యత, హైడ్రోపవర్ జనరేషన్‌పై ప్రభావం పడనున్నది. దీని వల్ల కరువు పెరిగే అవకాశం ఉన్నది. తాగునీటి నిల్వలపై వత్తిడి పెరగనున్నది. మార్చి 1వ తేదీ నుంచి మే 27 వరకు దేశవ్యాప్తంగా 121.7 మిల్లిమీటర్ల వర్షం పడింది.