(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సౌందర్య సంరక్షణ, ఫిజికల్ వెల్నెస్ సర్వీసులకు సంబంధించి ఇప్పటివరకూ ఉన్న 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 5 శాతానికి తగ్గిస్తూ తామేదో గొప్ప పని చేశామని కేంద్రంలోని మోదీ సర్కారు ప్రచారం చేసుకొంటున్నది. అయితే తాజా నిర్ణయంతో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జిమ్ సెంటర్లు, యోగా క్లాసులకు వెళ్లే వేలాది మందికి దక్కే ప్రయోజనం అంతంతేనని తెలుస్తున్నది. బ్యూటీ, వెల్నెస్ సర్వీసులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించినప్పటికీ, కస్టమర్లకు ఆ స్థాయిలో ప్రయోజనం చేకూరబోదని పారిశ్రామిక నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఉన్న బిల్లు పెరుగవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. బ్యూటీ, వెల్నెస్ సేవలను అందించే సర్వీస్ ప్రొవైడర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనాలు అందకపోవడమే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు.
ఐటీసీకి ‘నో’
సౌందర్య సంరక్షణ, ఫిజికల్ వెల్నెస్ సర్వీసులకు ఇప్పటివరకూ 18 శాతం జీఎస్టీ అమల్లో ఉండేది. దీనిని ప్రస్తుతం 5 శాతానికి తగ్గించారు. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) స్పష్టత ఇచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నది. తాజా నిర్ణయంతో బ్యూటీ సేవలు చవగ్గా అందుబాటులోకి వస్తాయని కేంద్రంలోని పెద్దలు చెప్తున్నారు. అయితే ఈ సేవలపై జీఎస్టీని 5 శాతానికి చేర్చిన కేంద్రం.. ఐటీసీ క్లెయిములకు ఆస్కారం ఉండబోదని వెల్లడించింది. ఇది అంతిమంగా కస్టమర్లకే భారంగా మారనున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు.
సౌందర్యం భారమే
ప్రస్తుతం బ్యూటీ, వెల్నెస్, యోగా క్లాసులను నిర్వహించే సర్వీసు ప్రొవైడర్లు, వ్యాపారులు కస్టమర్ల నుంచి 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. అలాగే ఈ సంస్థలు తాము పెట్టుకున్న కార్యాలయాలకు చెల్లిస్తున్న అద్దెకు, పీఆర్ టీమ్‌కు, వారికి ఇస్తున్న కమీషన్లకు, మార్కెటింగ్ తదితర కార్యకలాపాలకుగాను అన్ని దశల్లో ప్రభుత్వానికి జీఎస్టీని చెల్లిస్తూపోతున్నాయి. చివరకు ఈ మొత్తాన్ని కస్టమర్ల ద్వారా వచ్చే జీఎస్టీ ఆదాయంలో మినహాయించుకొని మిగిలిన దాన్నే సర్కారుకు చెల్లిస్తున్నాయి.
ఈ సర్దుబాటు సౌకర్యాన్నే ఐటీసీగా పేర్కొంటారు. అయితే, సౌందర్య సర్వీసుల్లో ఐటీసీ క్లెయిములకు ఆస్కారమే ఉండదని కేంద్రం తాజాగా తేల్చి చెప్పింది. దీంతో తమ వ్యాపార కార్యకలాపాలకు చేసే చెల్లింపుల భారం ఇకపై సర్వీసు ప్రొవైడర్ల మీదనే పడబోతున్నది. అందుకే ఐటీసీని కోల్పోనున్న సర్వీస్ ప్రొవైడర్లు దాన్ని భర్తీ చేసుకునేందుకు తమ సర్వీసు ఛార్జీలను కస్టమర్లపై అదనంగా వేసే వీలుందని ఇండస్ట్రీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే జరిగితే బ్యూటీ, వెల్నెస్ బేస్ ఛార్జీలు పెరగవచ్చని అంటున్నారు. ఇది వినియోగదారులకు కనిపించని కొత్త భారమేనని వివరిస్తున్నారు.