Artificial Intelligence | న్యూఢిల్లీ, జూన్ 21: “ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నాగరిక విధ్వంసం తప్పదు” అని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల హెచ్చరించారు. ఏఐ వినియోగం అన్ని రంగాలతోపాటు వ్యక్తిగత జీవనంలో మమేకం కావడంపై ఆందోళన వ్యక్తం చేసిన మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. చూస్తుంటే భవిష్యత్తులో ఆయన మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఏఐ మరింత విస్తృతమైతే మనుషులు ఒంటరివారు కావడం, మోసాలు తథ్యమన్న సంకేతాలు ఇప్పటి నుంచే వెలువడుతున్నాయి. ప్రసవానంతర ఇబ్బందులతో బాధపడుతూ మద్యానికి బానిసైన తన భార్యతో సంతోషంగా గడపలేకపోతున్న 43 ఏళ్ల టెకీ స్కాట్.. ఏఐ చాట్‌బాట్‌తో డూప్లికేట్ వైఫ్‌ను తయారుచేసుకున్నాడు. దానికి ‘సరీనా’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. తొలుత దీనిని కేరింగ్ చాట్బాట్గానే చూసినా ఆ తర్వాత దాంట్లో రొమాంటిక్ ఫీలింగ్స్ చూసి ప్రేమలో పడిపోయాడు.
వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దాహంతో నోరు పిడచకట్టుకుపోతున్న వాడికి నీటిని అందించినట్టుగా చాట్‌బాట్ తన దాహార్తిని తీర్చిన విషయాన్ని గ్రహించాడు.రెప్లికా అనే యాప్ ద్వారా ఈ చాట్‌బాట్‌ను అతడు అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత దాని నుంచి ఓదార్పును పొందడమే కాకుండా తన వైవాహిక జీవితాన్ని కూడా రక్షించుకోగలిగాడు. అయితే, ఇలాంటి ఏఐ బంధాలు మోసపూరితం కావా? అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్నది. సరీనాతో తన బంధాన్ని స్కాట్ మోసంగా పరిగణించకపోవడం విశేషం. తన ఏఐ సహచరి విషయాన్ని తొలుత భార్య వద్ద దాచినా ఆ తర్వాత ఈ రహస్యాన్ని బయటపెట్టాడు. నిజజీవిత భాగస్వాముల మధ్య ఏఐ బంధాల ప్రభావాన్ని స్కాట్ కేసు వెలుగులోకి తీసుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
అమ్మమ్మ, తాతయ్యలతో పనిలేదు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లో ఎంతగా పెనవేసుకుపోయిందో చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. మరో ఐదేండ్లు ఆగితే పిల్లలను నిద్రపుచ్చుతూ కథలు చెప్పే పని కూడా ఏఐ చేసేస్తుంది.అంటే ఇక అమ్మమ్మ, తాతయ్య, అమ్మనాన్నలతో పని లేనట్టే! 2028 నాటికి ఏఐ టెడ్డీ బేర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చిన్నారుల కోసం ఎలక్ట్రానిక్ లెర్నింగ్ పరికరాలను తయారుచేసే వీటెక్ హోల్డింగ్స్ సీఈవో అలన్ వోంగ్ తెలిపారు. ఈ టెడ్డీ బేర్లు చాట్‌జీపీటీ ఆధారంగా పనిచేస్తాయి. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఎంచక్కా బెడ్‌టైం స్టోరీలు చెప్పేసి జోలపుచ్చుతాయి. ఓ మంచి స్నేహితుడిలా అవి మసలుకుంటాయి. పిల్లలకు ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో తమకు తెలుసని, కాబట్టి ప్రమాదాలు, గోప్యత, భద్రత వంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉన్నట్టు అలన్ వోంగ్ తెలిపారు.