ఢాకా: హిందువులపై జరుగుతున్న దాడులు, హిందూ వ్యతిరేక అల్లర్లతో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇస్కాన్‌కు (ISKCON) చెందిన హిందూ పూజారులు, సభ్యులను అరెస్టు చేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని మైనార్టీలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు బయల్దేరిన ఇస్కాన్ సభ్యులు 63 మందిని బంగ్లాదేశ్ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. సరైన ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ బెనాపోల్ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వారిని నిలిపివేశారు. అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్నారే కారణంతో వారిని దేశం వీడేందుకు అనుమతించలేదని స్థానిక మీడియా వెల్లడించింది. ఉన్నతాధికారుల సూచన మేరకే అడ్డుకున్నట్లు పేర్కొంది.
వీరంతా శనివారం రాత్రి, ఆదివారం ఉదయం సరిహద్దు చెక్‌పోస్టుకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. మతపరమైన కార్యాక్రమంలో పాల్గొనేందుకు భారత్‌కు వెళ్తున్నట్లు చెప్పినప్పటికీ అధికారులు అడ్డుకున్నారని ఇస్కాన్ సభ్యుడు సౌరభ్ తపందర్ ఛేలి తెలిపారు. గంటలపాటు నిరీక్షించినా వారి నుంచి సరైన సమాధానం రాలేదని, దాంతో వెనుతిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం చెప్పకుండా వెనక్కి పంపారని మరో సభ్యుడు వెల్లడించారు.
బంగ్లాదేశ్‌లో హిందూ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చిట్టగ్యాంగ్‌లోని హరీశ్చంద్ర మున్సఫ్ లేన్‌లో ఉన్న శంతనేశ్వరి మాత్రి ఆలయంతోపాటు సమీపంలోని సోనీ ఆలయం, శంతనేశ్వరి కలిబరీ ఆలయాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు శుక్రవారం దాడి చేసి ధ్వంసం చేశారు. వందలాది మంది ఆందోళనకారులు హిందూ, భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఇటుకలతో ఆలయాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అయితే, పోలీసులు మాత్రం ఈ ఘటనను తేలిగ్గా తీసుకున్నారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఇటుకలు విసురుకునే క్రమంలో ఆలయాలు స్వల్పంగా దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. మిలటరీ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది.
మరోవైపు ఇస్కాన్‌కు చెందిన హిందూ పూజారి శ్యామ్ దాస్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల అరెస్టయిన హిందూ, ఇస్కాన్ నేత చిన్మయ్ కృష్ణ దాస్‌ను కలిసేందుకు జైలుకు వెళ్లిన సమయంలో శ్యామ్ దాస్‌ను, మరో వ్యక్తిని అరెస్టు చేశారని, అలాగే కృష్ణ దాస్ కార్యదర్శి కూడా అదృశ్యం అయ్యారని ఇస్కాన్ కోల్‌కతా అధికార ప్రతినిధి రాధారామన్ దాస్ తెలిపారు. దీనిపై బంగ్లాదేశ్ అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు భైరవ్లో ఉన్న ఇస్కాన్ కేంద్రంలో కొందరు దుండగులు విధ్వంసం సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాధారామన్ దాస్ ట్వీట్ చేశారు.