Telegram | న్యూఢిల్లీ, ఆగస్టు 26: ప్రముఖ మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన టెలిగ్రామ్ భారత్‌లో నిషేధానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రస్తుతం హోంశాఖ, ఐటీ శాఖ సహకారంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) విచారణ జరుపుతున్నది.
టెలిగ్రామ్‌లో అక్రమ కార్యకలాపాలతో పాటు ఇది భారతదేశ ఐటీ నిబంధనలను పాటిస్తున్నదా అనేది విచారణలో తేలనుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా టెలిగ్రామ్ పని చేస్తుందని విచారణలో వెల్లడైతే ఈ యాప్‌ను నిషేధించే అవకాశం ఉంది. కాగా, మానవ అక్రమ రవాణా, మోసాలు, సైబర్ బెదిరింపులు వంటి వాటిలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో మూడు రోజుల క్రితం టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పవెల్ దురోవ్‌ను ఫ్రెంచ్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.