న్యూఢిల్లీ, డిసెంబర్ 9 : ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు ఎదురవుతున్న దృష్ట్యా ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఎన్నికల్లో మళ్లీ బ్యాలట్ పేపర్ ప్రవేశపెట్టాలని మంగళవారం లోక్సభలో విపక్ష సభ్యులు గట్టిగా డిమాండు చేశారు. ఎన్నికల సంస్కరణలపై చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష సభ్యులు పేపర్ బ్యాలట్ విధానానికి వాపసు వెళ్లడమే సరైన ప్రతిపాదనని తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం తిరిగి బ్యాలట్ పేపర్ విధానానికి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈవీఎంలతో ఎన్నికల ప్రక్రియ వేగంగా, సురక్షితంగా జరుగుతోందని ప్రభుత్వం వాదించింది. కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ చర్చను ప్రారంభిస్తూ ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరి నిలబడిన రోజుల్లో తమ ఓటు సరైన అభ్యర్థికి చేరుతుందన్న నమ్మకం వారిలో ఉండేదని అన్నారు. ఈవీఎంలను తారుమారు చేస్తున్నారని తాను చెప్పడం లేదని, అయితే వాటిని తారుమారు చేయవచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు రెండే మార్గాలు ఉన్నాయిని, ఒకటి వీవీప్యాట్లను 100 శాతం లెక్కించడం, రెండవది బ్యాలట్ పేపర్లకు వాపసు వెళ్లడం అని ఆయన సూచించారు.
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా పేపర్ బ్యాలట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను సమర్థించారు. పేపర్ బ్యాలట్ విధానం మరింత విశ్వసనీయమైనదేగాక ప్రజలు విశ్వసించేదని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పేపర్ బ్యాలట్లకు తిరిగి వెళుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. నెదర్లాండ్స్, జర్మనీ, ఐర్లాండ్, పరాగ్వే, ఫిన్లాండ్, బంగ్లాదేశ్ సహా అనేక దేశాలు ఈవీఎంలను తిరస్కరించి పేపర్ బ్యాలట్లకు వాపసు వెళ్లాయని ఆయన చెప్పారు. ఈవీఎం విధానంలో అనేక లోపాలు ఉన్నాయని శివసేన(యూబీటీ) సభ్యుడు అనిల్ దేశాయ్ అన్నారు. తన ఓటు ఎవరికి వెళ్లిందో తెలుసుకోవలసిన అవసరం ఓటరుకు ఉందని, ఆ స్పష్టత కొరవడితే మనం స్వచ్ఛమైన ప్రజాస్వామ్యాన్ని పాటించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సీపీఎంకు చెందిన అమ్రా రామ్, ఆర్జేడీకి చెందిన అభయ్ కుమార్ సిన్హా కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఎన్నికల సంస్కరణలపై మంగళవారం లోక్సభలో చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) నిష్పాక్షితపై ప్రశ్నలు సంధించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల ఎంపికకు సంబంధించిన కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) తొలగించడం వెనుక ఉద్దేశమేమిటో చెప్పాలని మోదీ ప్రభుత్వాన్ని రాహుల్ నిలదీశారు. ఎంపిక కమిటీలో తనను మూడో సభ్యుడిగా చేసి నిమిత్తమాత్రుడిగా మిగిలినట్లు ఆయన తెలిపారు.