Badruddin Ajmal : అసోం ముస్లిం వివాహాలు విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం, 1935ను రద్దు చేయాలని అసోం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ స్పందించారు. మార్కెట్కు వెళ్లి అక్కడి ప్రజలను కలిస్తే మీ నిర్ణయం పట్ల వారు ఎంత విముఖతతో ఉన్నారో వెల్లడవుతుందని కాషాయ పాలకులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పాలకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడాలని హితవు పలికారు.
ఇది ప్రజాస్వామ్యం..హిట్లర్ కాలం కాదని పేర్కొన్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి..మీరు (బీజేపీ) ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు, హిందూ సోదరులు కూడా ఈ విషయం అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. అసోం అభివృద్ధిలో బీజేపీ పాలకుల పాత్ర ఏంటని బద్రుద్దీన్ అజ్మల్ నిలదీశారు. ప్రపంచ బ్యాంకు నిధులతోనే ఇక్కడ అన్ని పనులు చేపడుతున్నారని ఆయన చెప్పారు.
కాగా, లవ్ జిహాద్ కేసుల్లో జీవిత ఖైదు విధించేలా తమ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొస్తుందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అంతకుముందు పేర్కొన్నారు. గువహటిలో ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లవ్ జిహాద్ గురించి తాము ఎన్నికల సందర్భంగా మాట్లాడామని, త్వరలో దీనిపై చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఇలాంటి కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చట్టంలో పొందుపరుస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నూతన నివాస విధానాన్ని తీసుకొస్తుందని, ఈ విధానం ప్రకారం అసోంలో జన్మించిన వారికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అర్హత ఉంటుందని చెప్పారు. ఎన్నికల హామీల ప్రకారం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, వాటిలో స్ధానిక యువతకే అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని స్పష్టం చేశారు. హిందూ, ముస్లింల మధ్య భూ విక్రయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ తరహా లావాదేవీలను ప్రభుత్వం నిరోధించకపోయినా వీటిపై ముందుకెళ్లే ముందు సీఎం అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసిందని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు.
Read More :
Pakistan posters | ఓ వ్యక్తి ఇంట్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం