Badlapur | మహారాష్ట్రలోని థాణే జిల్లా బద్లాపూర్ (Badlapur)లో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన (Sexual Assault Case) తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. చిన్నారులపై లైంగిక వేధింపులకు ఒడిగట్టిన కీచకుడిపై, పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం ఉదయం తల్లిదండ్రులు స్థానికులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. కొందరు ఆగ్రహంతో పాఠశాలపై దాడికి పాల్పడి వస్తువులు ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్‌ను దిగ్బంధనం చేశారు. ఈ నేపథ్యంలో సుమారు 300 మంది నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు (FIR Registered) చేసినట్లు థానే పోలీసులు బుధవారం తెలిపారు. 40 మందికిపైగా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్ట్ చేసిన వారిని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
తల్లిదండ్రుల కథనం ప్రకారం.. బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులు (మూడేండ్లు, నాలుగేండ్ల వయస్సు) ఆగస్టు 13న టాయిలెట్‌కు వెళ్లగా, అక్కడే స్వీపర్‌గా పని చేస్తున్న అక్షయ్ షిండే అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆగస్టు 16న వీరిలో ఓ చిన్నారి తనకు ప్రైవేటు భాగాల వద్ద నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పింది. దాంతో ఆరా తీయగా, మరో చిన్నారికి కూడా అలా జరిగిందని తెలియడంతో ఇద్దరు చిన్నారులను స్థానిక దవాఖానకు తీసుకెళ్లగా వారిపై లైంగిక వేధింపులు జరిగాయని వైద్యులు చెప్పారు. దీంతోపోలీసులకు ఫిర్యాదు చేయగా ఆగస్టు 17న నిందితుడు అక్షయ్ షిండేను అరెస్టు చేశారు.
ప్రజల్లో ఆగ్రహజ్వాలలు
చిన్నారులపై లైంగిక వేధింపులకు ఒడిగట్టిన కీచకుడిపై, పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం ఉదయం తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. కొందరు ఆగ్రహంతో పాఠశాలపై దాడికి పాల్పడి వస్తువులు ధ్వంసం చేశారు. తర్వాత పక్కనే ఉన్న బద్లాపూర్ రైల్వే స్టేషన్‌పైనా రాళ్లు రువ్వారు. స్టేషన్లోకి ప్రవేశించి పట్టాలపై కూర్చొని రైల్ రోకో నిర్వహించారు. దీంతో 30 లోకల్ రైళ్లు రద్దయ్యాయి. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన 12 రైళ్లను దారి మళ్లించారు. చాలా రైళ్లు ఆలస్యమయ్యాయి. కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు రావడంతో బద్లాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్‌తో పాటు ఓ మహిళా సహాయకురాలిని విధుల నుంచి తొలగించినట్టు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది.
Badlapur Bandh: Protest Affects CR Services, No Trains Running Beyond Ambernath; Police On Spot#Badlapur #Mumbai #Trains pic.twitter.com/viVkQJrwXK
— Free Press Journal (@fpjindia) August 20, 2024
విచారణ జరపనున్న ఎన్సీపీసీఆర్, సిట్
బద్లాపూర్ ఘటనపై బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ (ఎన్సీపీసీఆర్) స్పందించింది. కేసులో పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఎన్సీపీసీఆర్ చైర్పర్సన్ ప్రియాంక్ కనుంగో తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారి ఆర్తి సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించింది. కేసును ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారణ జరిపించి, న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. కాగా, ఈ పాఠశాల బీజేపీకి చెందిన వ్యక్తిదని తనకు తెలిసిందని, అయినా రాజకీయాలు చేయదల్చుకోలేదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన (ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.
Also Read..
Teacher Arrest | నిన్న బద్లాపూర్.. నేడు అకోలా..! ఆరుగురు విద్యార్థినులపై టీచర్ లైంగిక వేధింపులు..
NDA | ఒకసారి నిర్ణయం.. వ్యతిరేకతతో వెనక్కి.. మోదీ 3.Oలో మారిన ఎన్డీయే ప్రభుత్వ వైఖరి