Teacher Arrest | మహారాష్ట్ర బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అటెండర్ లైంగిక దాడి ఘటన వెలుగు చూసింది. ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి మరో వైపు విచారణ కొనసాగుతున్న తరుణంలో అకోలాలో మరో విద్యార్థినులపై వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బాలికలకు అసభ్యకర వీడియోలు చూపిస్తూ వారిపై వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కాజిఖేడ్కు చెందిన ఉపాధ్యాయుడు ప్రమోద్ మనోహర్ (47)పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రమోద్‌పై ఆరుగురు బాలికలు ఫిర్యాదు చేశారని అకోలా ఎస్పీ బచ్చన్ సింగ్ తెలిపారు. విద్యార్థినులను ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేసేవాడని, అసభ్యకరమైన వీడియోలు చూపించేవాడని పేర్కొన్నారు. బాధిత విద్యార్థినుల వాంగ్మూలాలను నమోదు చేశామని.. నిందితుడిపై బీఎన్ఎస్, పోక్సో చట్టంలోని సెక్షన్ 74, 75 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. థానే జిల్లా బద్లాపూర్‌లో పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
కిండర్ గార్టెన్‌లో చదువుతున్న మూడు, నాలుగేళ్ల ఇద్దరు బాలికలపై అటెండర్ వేధింపులకు పాల్పడినట్లు బాలికల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. టాయిలెట్‌కు వెళ్లిన విద్యార్థినులతో అటెండర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు మరుసటి రోజు స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో పాటు ప్రైవేట్ పార్ట్స్ వద్ద నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్‌గా తీసుకున్నది. విచారణ కోసం ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ప్రిన్సిపాల్‌తో పాటు క్లాస్ టీచర్, మహిళా అటెండర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ఈ ఘటనపై పాఠశాల క్షమాపణలు కూడా చెప్పింది. బాలికలపై లైంగిక వేధింపుల మహారాష్ట్రలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. లోకల్ రైళ్లను సైతం అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి ట్రాక్ ఆందోళనకారులను చెదరగొట్టారు.