న్యూఢిల్లీ, ఆగస్టు 20: గత పదేండ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టుబట్టిన పనులన్నీ పూర్తి చేసింది. సంప్రదింపులు, సమీక్షలు వంటివేమీ లేకుండా చేయాలనుకున్న చట్టాలన్నీ చేసింది. విమర్శలు వచ్చినా, వ్యతిరేకత వ్యక్తమైనా వినిపించుకోలేదు. అయితే, నరేంద్ర మోదీ మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. కేవలం మూడు నెలల కాలంలోనే నాలుగు విషయాల్లో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఎన్నికల్లో ఊహించని స్థాయిలో సీట్లు తగ్గిపోయిన ప్రభావమో, మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతుండటం వల్లనో కానీ ఏదైనా నిర్ణయంపై వ్యతిరేకత వస్తే మోదీ ప్రభుత్వం పీఛేముడ్ అంటున్నది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రసార సేవల(నియంత్రణ) చట్టం చేయాలనుకుంది. ముసాయిదా రూపొందించి స్టేక్హోల్డర్లకు పంపించింది. అయితే, ఈ బిల్లు స్వతంత్ర జర్నలిస్టుల గొంతునొక్కేలా ఉందనే విమర్శలు వచ్చాయి. భావప్రకటన స్వేచ్ఛను హరించేలా ఈ బిల్లు ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం ఈ ముసాయిదా బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. తర్వాత వక్ఫ్(సవరణ) బిల్లు విషయంలోనూ ఇలానే జరిగింది. వక్ఫ్ బోర్డు వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ మోదీ ప్రభుత్వం చట్టం చేయాలనుకుంది. అయితే, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అనేక పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. దీంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలనకు ప్రభుత్వం పంపించాల్సి వచ్చింది.
స్థిరాస్తుల అమ్మకాలపై వచ్చే లాభాలపై విధించే మూలధన లాభాల పన్నులో ఇండెక్సేషన్ ప్రయోజనం విషయంలోనూ వ్యతిరేకత రావడంతో కేంద్రం వెనక్కు తగ్గింది. ఇండెక్సేషన్ ప్రయోజనం లేని కొత్త విధానం, పాత పన్ను విధానంలో ఏదైనా ఎంచుకునే వెసులుబాటును ప్రజలకు కల్పించింది. ఇప్పుడు ల్యాటరల్ ఎంట్రీ విషయంలోనూ ఇదే జరిగింది. 2018లోనూ ఈ విధానంలో కేంద్రం పలు నియామకాలు చేపట్టింది. అప్పుడు విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం చిరాగ్ పాశ్వాన్ వంటి ఎన్డీఏలోని నేతలే వ్యతిరేకించడంతో వెనక్కు తగ్గక తప్పలేదు.