Sandip Ghosh | కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కళాశాల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో వైద్య కళాశాల మాజీ చీఫ్ (colleges ex head) సందీప్ ఘోష్ (Dr Sandip Ghosh) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హత్యాచార ఘటన నేపథ్యంలో ఆయన ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైద్యురాలి ఘటనలో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై అవినీతి ఆరోపణలు (Corruption case) వెల్లువెత్తుతున్నాయి.
ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడటమే కాకుండా.. బయోమెడికల్ వ్యర్థాలు, వైద్య సమగ్రిని కూడా ఇతర దేశాలకు రవాణా చేసి సొమ్ము చేసుకున్నట్లు ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ తాజాగా ఆరోపించారు. సందీప్ ఘోష్ క్లెయిమ్ చేయని మృతదేహాలను విక్రయించడం (sold unclaimed bodies) సహా అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అక్తర్ అలీ గతేడాది వరకూ ఆర్జీ కార్ కళాశాలలోనే పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. అయితే, సందీప్ ఆగడాలపై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేసినట్లు ఆయన తాజాగా వెల్లడించారు. ఆసుపత్రిలో వినియోగించిన సిరంజ్‌లు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజులు వంటి బయోమెడికల్ వ్యర్థాలు ప్రతీ రెండ్రోజులకు 500 కిలోల వరకూ పోగెయ్యేవని తెలిపారు. వాటిని ఇద్దరు బంగ్లాదేశీవాసుల సాయంతో బంగ్లాదేశ్‌కు రవాణా చేసి రీసైక్లింగ్ చేయించేవాడని పేర్కొన్నారు.
సందీప్ చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి రాష్ట్ర విజిలెన్స్, ఏసీబీ, హెల్త్ డిపార్ట్‌మెంట్స్‌కు తాను గతంలోనే ఫిర్యాదు చేసినట్లు అక్తర్ అలీ తెలిపారు. దీంతో మాజీ ప్రిన్సిపల్‌పై విచారణకు కమిటీని ఏర్పాటు చేశారని, అందులో తాను కూడా సభ్యుడినని చెప్పారు. ఈ విచారణలో సందీప్ దోషిగా తేలినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. సందీప్ ఘోష్‌పై రాష్ట్ర ఆరోగ్య శాఖకు విచారణ నివేదికను సమర్పించినట్లు చెప్పారు. అయితే, అదే రోజు తనపై బదిలీ వేటు వేశారని అలీ పేర్కొన్నారు. ‘నేను సందీప్‌పై విచారణ నివేదిక సమర్పించాను. ఇక అదే రోజు నన్ను ఆర్జీ కార్ ఆసుపత్రి నుంచి బదిలీ చేశారు. ఈ కమిటీలోని మిగిలిన ఇద్దరు సభ్యులను కూడా బదిలీ చేశారు. అతని నుంచి విద్యార్థులను రక్షించేందుకు నేను చేయగలిగినదంతా చేశాను. అయితే, ఆ ప్రయత్నంలో విఫలమయ్యాను’ అని అలీ వివరించారు.
Also Read..
Polygraph Test: ఆర్జీ కార్ ఆస్పత్రి ప్రిన్సిపాల్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష !
Teacher Arrest | నిన్న బద్లాపూర్.. నేడు అకోలా..! ఆరుగురు విద్యార్థినులపై టీచర్ లైంగిక వేధింపులు..
Bharat Band | నేడు భారత్ బంద్.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిలుపు