న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం భారత్ బంద్ నిర్వహిస్తున్నట్టు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ప్రకటించింది. ఈ బంద్‌కు రాజస్థాన్‌లోని ఎస్సీ, ఎస్టీ సంఘాలు మద్దతు ప్రకటించాయి.
ఆయా రాష్ర్టాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలలో కులాలను ఉప కులాలుగా విభజించి రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ర్టాలకు దఖలు పరుస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పు అన్యాయంగా ఉన్నదని, దీని గురించి దేశ ప్రజలకు వెల్లడించేందుకు బుధవారం భారత్ బంద్ నిర్వహిస్తున్నట్టు సమితి ప్రకటించింది.
పలు సామాజిక, రాజకీయ సంఘాలు, పార్టీలు ఈ బంద్‌కు మద్దతు ఇస్తాయని భావిస్తున్నారు. భారత్ బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్టు రాజస్థాన్ అధికారులు తెలిపారు.
అట్టడుగు వర్గాలకు బలమైన రిజర్వేషన్, ప్రాతినిధ్యం కోరుతూ దళిత, ఆదివాసీ సంస్థలు కూడా భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్ (ఎన్ఏసీడీఏఓఆర్) తమ డిమాండ్ల లిస్టును విడుదల చేసింది.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సమానత్వం, న్యాయం కల్పించాలని కోరింది. రిజర్వేషన్లపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఎస్సీ, ఎస్టీలకు సంక్రమించిన రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందని పేర్కొంది. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు బుధవారం శాంతియుతంగా భారత్ బంద్‌లో పాల్గొని తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చింది.