Siddaramaiah | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసం రాష్ట్రాలకు సరైన వాటా నిధులు విడుదల చేయాలని కోరారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపొద్దని కోరారు. ప్రజాతీర్పును అపహస్యం చేసేలా తెర వెనుక రాజకీయాలు చేసే వారిని ప్రజలు మరిచిపోరని పేరు చెప్పకుండానే బీజేపీని విమర్శించారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ సూత్రాలకు లోబడి పాలన సాగించాలని భావిస్తాయన్నారు. రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. సంక్షేమ పథకాల అమలు బాధ్యత రాష్ట్రాలది కాగా, వాటికి అవసరమైన నిధులు సమకూరుస్తూ కేంద్రం మద్దతు ఇవ్వాలన్నారు. కానీ కేంద్రం ఈ సూత్రం అమలు చేయకుండా దూరమవుతోందన్నారు.
రాజ్యాంగ సూత్రాలను నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్రాలకు నిధుల విడుదలలో జాప్యం చేసే ధొరణి పెరిగి పోయిందని సిద్దరామయ్య పేర్కొన్నారు. ఈ ధోరణి వల్ల రాష్ట్రాలు తమ న్యాయమైన వాటా కోసం న్యాయ పోరాటానికి దిగాల్సి వస్తుందన్నారు. విపక్షాల పాలిత రాష్ట్రాలకు నిధుల విడుదలలో వివక్షను నిరసిస్తూ.. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్ లతోపాటు ఆ రెండు రాష్ట్రాల మంత్రులు గత ఫిబ్రవరిలో ఢిల్లీలో నిరసన తెలిపారు. తమ హక్కుల పరిరక్షణ కోసం కేరళ సుప్రీంకోర్టు తలుపు తట్టింది.