న్యూఢిల్లీ, అక్టోబర్ 8: మొన్న బర్రె అడ్డమొస్తే రైలు ముందటి భాగం ఊడింది. నిన్న ఆవు అడ్డమొస్తే అదే ముందటి భాగం డొక్కు పోయింది. ఇప్పుడిక రైలు చక్రాల వంతు వచ్చింది. ఇదీ! ప్రధాని మోదీ ప్రారంభించిన వందే భారత్ రైలు ఘన చరిత్ర. శనివారం ఢిల్లీ నుంచి బయలుదేరిన రైలు (నంబరు 22436).. ధన్కౌర్-వెయిర్ స్టేషన్ల మధ్యకు రాగానే ఒక చక్రం జామ్ అయ్యింది. సీ8 కోచ్ కింది భాగంలో ట్రాక్షన్ మోటర్లో బేరింగ్ సమస్యలు తలెత్తాయి. సమస్యను గుర్తించిన గ్రౌండ్ స్టాఫ్.. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. తక్కువ వేగంతో దగ్గరలోని ఖుర్జా రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లి, అక్కడ ప్రయాణికులను శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఎక్కించారు. ఘటనపై అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.