Irumudi : భారత పౌరవిమానయాన శాఖ (Indian civil aviation ministry) అయ్యప్ప భక్తుల (Ayyappa devotees) కు శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వాములు ఇరుముడి (Irumudi) తో ప్రయాణం చేయడానికి అనుమతి ఇచ్చింది.
‘శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ.. భక్తులు ఇరుముడిని తమతోపాటు నేరుగా విమానంలో తీసుకెళ్లేలా మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా’ అని ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా మా నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని చెప్పారు.