న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశవ్యాప్తంగా రూ.1,600 కోట్లతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కేంద్రరంగ పథకాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) అమలు చేస్తుంది. ఈ పథకం ఐదేండ్ల పాటు అమలు అవుతుంది. ఏబీడీఎం కింద పౌరులు ఆయుష్మాన్ భారత్ అకౌంట్లు తెరచి తమ ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులను లింక్ చేయవచ్చు.
బొగ్గు వేలానికి సింగిల్ విండో
నాన్-లింకేజీ బొగ్గు వేలాన్ని ఆయా రంగాలవారీగా వేలం వేయకుండా ఉమ్మడిగా ఈ-ఆక్షన్ ద్వారా వేలం వేసే విధానానికి కేంద్ర తెరతీస్తున్నది. ఈ ప్రతిపాదనకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం శనివారం ఆమోదం తెలిపింది. ఇకనుంచి ఈ బొగ్గును కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసే ఈ-ఆక్షన్ విండో ద్వారా వేలం వేస్తాయి. బొగ్గు కంపెనీలు వివిధ రంగాలకు విచక్షణ మేరకు బొగ్గును కేటాయించే విధానాన్ని రద్దుచేశారు. దీంతో అన్నిరంగాలకు ఒకేధరకు బొగ్గు లభిస్తుందని, దీనిద్వారా బొగ్గుకు డిమాండ్ పెరుగుతుందని కేంద్రం అంటున్నది. ఇకనుంచి విద్యుత్తు రంగానికి, వ్యాపారులతో సహా క్రమబద్దీకరణ రహిత రంగానికి బొగ్గు సరఫరా సింగిల్ విండో వేలం ద్వారానే జరుగుతుంది. ఇప్పటివరకు బొగ్గు సరఫరాకు రైల్వే రవాణా మాత్రమే ఉండేది. ఇకనుంచి ఏ మార్గం ద్వారానైనా బొగ్గును తరలించుకునే అవకాశం కలుగుతుంది.
ఉక్రెయిన్ యుద్ధంపై క్యాబినెట్ సమీక్ష
ఉక్రెయిన్ యుద్ధపరిస్థితిపై శనివారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం సమీక్షించింది. భారతీయులను సురక్షితంగా తరలించడం గురించి చర్చించింది. రక్షణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కూడా విడిగా సమావేశమై ఉక్రెయిన్ పరిస్థితిని సమీక్షించినట్టు తెలిసింది.