Ayodhya | అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిథులను ఆహ్వానిస్తున్నారు. అయితే, అయోధ్య రామ మందిరం ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నేతలకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఇందులో ప్రవీణ్ తొగాడియా ఒకరు. గతంలో ఆయన విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడిగా పని చేశారు. రామమందిరం ఉద్యమాన్ని ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించిన సమయంలో.. వీహెచ్పీలో కీలకపాత్ర పోషించిన ఆయన ఉద్యమంలో కీలక భూమిక పోషించారు.
రామమందిరం కోసం కృషి చేసిన ఆయనకు రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తన జీవితంలో అతిపెద్ద లక్ష్యం నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 1984 నుంచి 2018 వరకు అన్ని రంగాల్లో ఉద్యమానికి తనవంతు సహకారం అందించినందుకు గర్వంగా ఉంటుందన్నారు. ఉద్యమం వెనుక అసలు లక్ష్యం జన్మస్థలంలో రాముడిని ప్రతిష్ఠించడమేననన్నారు.
ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇంతకంటే ముఖ్యమైందేమీ ఉండదన్నారు. ఈ సందర్భంగా రామమందిరం కోసం నిస్వార్థంగా ఉద్యమం చేసి ప్రాణత్యాగం చేసిన ఆ ఆందోళనకారులను సన్మానించాలని ఆయన కోరారు. అశోక్ సింఘాల్, మహంత్ వైద్యనాథ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్, ఆచార్య ధర్మేంద్ర వంటి వారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రారంభోత్సవంలోనే ప్రకటించాలని ఆయన అన్నారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన రామభక్తులకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించాలని ప్రవీణ్ తొగాడియా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.