న్యూఢిల్లీ: విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు పౌర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. స్వాములు విమాన ప్రయాణంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయ సహా) చేతి సామానుగా (క్యాబిన్ లగేజ్) తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ సౌకర్యం శుక్రవారం నుంచి వచ్చే ఏడాది జనవరి 20 వరకు అమలులో ఉంటుందని చెప్పారు.
ఇప్పటివరకు ఇరుముడిని కేవలం చెక్-ఇన్ లగేజీగా మాత్రమే అంగీకరించే వారు. దీంతో భక్తులు ఇబ్బంది పడేవారు. భక్తులు చేసిన విజ్ఞప్తి మేరకు, వారి విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం సంబంధితం శాఖలతో సమన్వయం చేసుకుని భక్తుల కోసం ప్రత్యేక మినహాయింపును ప్రకటించింది. అయ్యప్ప స్వామి భక్తుల దీక్ష, ఆచార వ్యవహారాల పట్ల గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు.