Siachen Camp | లడక్ సియాచిన్ గ్లేసియర్‌లోని బేస్ క్యాంప్ వద్ద మంగళవారం మంచు చరియలు విరిగిపడ్డాయి. దాంతో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. రక్షణవర్గాల సమాచారం మేరకు.. ఈ ఘటన అకస్మాత్తుగా జరిగిందని.. రెస్క్యూ టీం వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. సైన్యం ఇతర సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సైనికుల మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతోందని ఓ అధికారి తెలిపారు. పెద్ద ఎత్తున హిమపాతం పెరిగింది.
సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే ఎత్తయిన వార్ జోన్. ఇక్కడ ఉష్ణోగ్రతలు సున్నా నుంచి మైనస్ 60 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. దాంతో ఇక్కడ సైనికులు మంచు తుఫానుతో ఇబ్బందులుపడుతుంటారు. తీవ్రమైన చలి కారణంగా పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు పలు సమస్యలు ఉంటాయి. సియాచిన్ గ్లేసియర్ ఇండో-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో 78 కిలోమీటర్ల విస్తరించి ఉంటుంది. ఒక వైపు పాకిస్తాన్, మరొక వైపు చైనా సరిహద్దు అక్సాయ్ చిన్ ఉంటుంది. వ్యూహాత్మకంగా సియాచిన్ గ్లేసియర్ భారత్‌కు కీలకం. 1984కి ముందు.. ఇక్కడ భారత సైన్యం ఉండేది కాదు. 1972 సిమ్లా ఒప్పందంలో సియాచిన్ ప్రాంతాన్ని బంజరు భూమిగా ప్రకటించారు.
కానీ, ఒప్పందంలో రెండుదేశాల మధ్య సరిహద్దులను నిర్ణయించలేదు. 1984 సంవత్సరంలో పాకిస్తాన్ సియాచిన్‌ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా భారత్‌కు నిఘా సమాచారం అందింది. ఆ తర్వాత 1984 ఏప్రిల్ 13న భారత్ తన సైన్యాన్ని మోహరించింది. ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి సైన్యం ఆపరేషన్ మేఘదూత్‌ను ప్రారంభించింది.
సియాచిన్ గ్లేసియర్ ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK), అక్సాయ్ చిన్ షాక్స్‌గామ్ లోయలకు ఆనుకొని ఉంటుంది. వీటిని పాకిస్తాన్ 1963లో చైనాకు అప్పగించింది. ఇది భారతదేశానికి వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైంది. శత్రువుల కార్యకలాపాలపై నిఘా వేసి ఉండవచ్చు. ఈ ప్రదేశం లేహ్ నుంచి గిల్గిట్ వరకు ఉన్న మార్గాలను సైతం నియంత్రిస్తుంది. సైన్యంపరంగా, వ్యూహాత్యకంగా ఈ గ్లేసియర్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.