మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 13:21:04

ఆటోమొబైల్ ఎంప్లాయిస్ కు శుభవార్త

 ఆటోమొబైల్ ఎంప్లాయిస్ కు శుభవార్త

ఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని అన్ని రంగాల పైనా పడింది. అయితే అన్నిటి కంటే ఎక్కువగా నష్టపోయింది ఆటోమొబైల్ రంగం ఒక్కటే...గత రెండేండ్లుగా ఈ పరిశ్రమలో విపరీతమైన మందగమనం కొనసాగు తున్నది. దానికి తోడు కరోనా తోడవటంతో ఇక ఈ పరిశ్రమ కుదేలైపోయింది. అయితే, లాక్ డౌన్ ఎత్తివేసి సుమారు రెండు నెలలు గడుస్తున్న తరుణంలో మిగితా పరిశ్రమల కంటే ముందుగా కోలుకుంటున్నది కూడా ఇదే పరిశ్రమ అని చెప్పొచ్చు. ఊహించిన దాని కంటే అధిక వేగంతో ఈ పరిశ్రమ కోలుకుంటుండటంతో ఆటోమొబైల్ కంపెనీల్లో జోష్ మొదలైంది. దీంతో అవి తమ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ, ఇంక్రెమెంట్లు, బోనస్ లు ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రజల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. గత 2-3 ఏండ్లుగా మొత్తం షేరింగ్ ఎకానమీ ఆధిపత్యం చెలాయించగా... కరోనా వ్యాప్తితో సామాజిక దూరం పాటించాల్సి వ స్తున్నది. దీంతో ప్రజా రవాణా, షేరింగ్ ట్రాన్స్పోర్టేషన్ కు గిరాకీ తగ్గి, మళ్ళీ సొంత వాహనాల కొనుగోలు కే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆటోమొబైల్ కంపెనీలకు కేవలం 2 నెలల్లోనే మళ్ళీ కోవిడ్ -19 కంటే ముందు ఉన్న అమ్మకాల్లో 85 శాతానికి  పెరిగాయి. త్వరలోనే మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ఊహించినదానికంటే ముందే  పెరుగుదల కనిపిస్తుండటంతో అవి తమ ఉద్యోగులకు వేతనాల పెంపు, బోనస్ లు, ఇంక్రెమెంట్లు ప్రకటిస్తున్నాయి.

ఈ పరిణామం మరిన్ని రంగాలకు భరోసానిస్తే మన ఆర్థిక వ్యవస్థ త్వరలోనే కోలుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలోని 14 ప్రధాన కార్లు, వాహనాలు తయారు చేసే ఆటోమొబైల్ కంపెనీల్లో 10 కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలు పెంపు, బోనస్, ఇంక్రెమెంట్ల చెల్లింపు నిర్ణయాలు తీసుకోవటం విశేషం. త్వరలోనే మరిన్ని కంపెనీలు కూడా ఇదే బాటన పయనించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోండా, టొయోట, రెనాల్ట్ కంపెనీలు తమ ఉద్యోగులకు 4 శాతం నుంచి 14శాతం వరకు వేతనాలు పెంచాయి.

ఉద్యోగుల కేటగిరీ ని బట్టి వారికి జీతభత్యాల పెంపు వర్తిస్తుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా అయితే తమ కార్మికులకు ప్రమోషన్లు కూడా ప్రకటించగా... ఉద్యోగులకు బోనస్ లను కూడా చెల్లించటం విశేషం. ఈ విషయాన్నీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ - పీపుల్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ సపోర్ట్, స్టీఫెన్ సుధాకర్ వెల్లడించారు. మారుతి, ఫోర్డ్, స్కోడా, వోక్స్ వాగన్, ఎంజి మోటార్ గతంలో ఇంక్రెమెంట్ల ను వాయిదా వేయగా... త్వరలోనే దానిపై సానుకూల నిర్ణయం తీసుకోనున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అయితే... తమ ఉద్యోగుల వేతనాలు తగ్గించేది లేదని, అలాగే పెంపు కూడా ఉండబోదని స్పష్టం చేసింది.logo