న్యూఢిల్లీ: ఆర్మీకి చెందిన ముగ్గురు లెఫ్టినెంట్ కల్నల్స్( Lt. Colonels)తో పాటు 13 మంది సైనికులపై హత్యాయత్నం, దొంగతనం కేసు నమోదు అయ్యింది. కుప్వారా పోలీసు స్టేషన్‌పై జరిగిన దాడిలో భాగంగా ఈ కేసును ఫైల్ చేశారు. మే 28వ తేదీ రాత్రి జరిగిన ఘటన ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ డ్రగ్ కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు ఓ ఆర్మీ జవాన్‌ను విచారించారు. జవాన్‌ను ప్రశ్నించడాన్ని తప్పుపట్టిన కల్నల్స్ దాడికి దిగినట్లు తెలుస్తోంది. జవాన్లు జరిపిన దాడిలో అయిదుగురు పోలీసులు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గాయపడ్డారు. సైనికులు చేసిన దాడికి చెందిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. పోలీసులపై తాము దాడి చేయలేదని ఆర్మీ పేర్కొన్నది. స్వల్ప తగాదా జరిగినట్లు తెలిపింది. సమస్య సానుకూలంగా పరిష్కారమైనట్లు రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. అల్లర్లకు పాల్పడడం, హత్యాయత్నం, పోలీసుల కిడ్నాప్ లాంటి కేసులను జవాన్లపై బుక్ చేశారు.