న్యూఢిల్లీ, మార్చి 20: ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించే ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామక చట్టం – 2023ను కేంద్రంసమర్థించుకొన్నది. పిటిషనర్లు కావాలనే వివాదం సృష్టిస్తున్నారని పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ చట్టం ప్రకారం కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించొద్దని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చే ముందు రోజే(మార్చి 14న) హడావుడిగా ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించారన్న పిటిషనర్లు వాదనను న్యాయశాఖ వ్యతిరేకించింది.
సెలక్షన్ కమిటీ ఫలానా పద్ధతిలో ఉంటేనే ఏ సంస్థ స్వతంత్రత అయినా కొనసాగుతుందనడం సరికాదని పేర్కొన్నది. ఈసీ అయినా, మరే సంస్థ స్వతంత్రతైనా సెలక్షన్ కమిటీలో జ్యుడీషియల్ సభ్యుడు ఉండటంపై ఆధారపడి ఉండదని న్యాయశాఖ పేర్కొన్నది. కొత్త ఎన్నికల కమిషనర్ల అర్హతలపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదనే విషయాన్ని ప్రస్తావించింది. అర్హుల జాబితాను ప్రతిపక్షానికి ఇవ్వలేదని పిటిషనర్లు చేసిన వాదన తప్పని, మార్చి 13నే కమిటీ ఎంపిక చేసిన ఆరుగురితో కూడిన జాబితాను లోక్సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి అందించినట్టు తెలిపింది. కాగా, ఈ కేసు గురువారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది.