ధర్(మధ్యప్రదేశ్), జనవరి 3 : యూనియన్ కార్బైడ్ నుంచి 337 టన్నుల ప్రమాదకర వ్యర్థాల దహనానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్లోని పీతంపుర్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మాహుతికి యత్నించడంతో శుక్రవారం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పీతంపుర్ బచావో సమితి నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు తమ శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో అక్కడే ఉన్న తోటి ఆందోళనకారులు, పోలీసులు వెంటనే మంటలను ఆర్పివేశారు. వారిద్దరినీ వెంటనే దవాఖానకు తరలించారు. 1984 డిసెంబర్ 2-3 మధ్య రాత్రి భోపాల్లోని యూనియన్ కార్బైడ్ పెస్టిసైడ్ ఫ్యాక్టరీలో మెథైల్ ఐసోసైనేట్(ఎంఐసి) అనే విషవాయువు లీకై 5,479 మంది మరణించగా కొన్ని వేల మంది భయంకరమైన, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడ్డారు. శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాలను నిర్మూలించేందుకు 337 టన్నుల వ్యర్థాలను కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి పీతంపుర్కు ప్రభుత్వం తరలించింది. తమ పట్టణంలో వీటిని దహనం చేయడానికి వీల్లేదని, ఇత తమ ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్యని ఆగ్రహిస్తూ పీతంపుర్ బచావో సమితి పేరటి ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు.