Madhya Pradesh | భోపాల్, అక్టోబర్ 25: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మహిళలకు భద్రత కరువైంది. రెండు రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు లైంగికదాడి ఘటనలు రాష్ట్రంలో సంచలనం రేపాయి. రేవాలో సోమవారం దేవాలయం సమీపంలో పిక్నిక్కు వెళ్లిన యువ దంపతులపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. వారు భర్తను చెట్టుకు కట్టేసి, అతని ఎదుటే భార్యపై సామూహిక లైంగిక దాడి చేశారు. దానిని వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆన్లైన్లో ఉంచుతామని బెదిరించారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు.
ఇండోర్లో 40 ఏండ్ల మతిస్థిమితం లేని మహిళ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా చూసిన 20 ఏండ్ల యువకుడు ఆమెను పొలాల్లోకి తీసుకుని పోయి లైంగిక దాడి చేశాడు. బాధితురాలు ఒంటినిండా రక్తంతో అర్ధనగ్నంగా సాదర్ బజార్ ప్రాంతంలో వెళ్తున్న దృశ్యం సీసీ టీవీలో నమోదైంది. తర్వాత సోను అనే రోజువారీ కూలీని పెట్రోలింగ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. బాధితురాలిని దవాఖానకు పంపారు. రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న అత్యాచారాలపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ జీతూ పట్వారీ తీవ్రంగా మండిపడ్డారు. ‘ఒక ఆడ కూతురు అత్యాచారానికి గురై రోడ్లపై నగ్నంగా తిరుగుతుండగా, ముఖ్యమంత్రి మాత్రం ఒక ఈవెంట్లో బిజీగా ఉన్నారు’ అని విమర్శించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని, రోజుకు 18 నుంచి 20 మంది బాలికలు అత్యాచారానికి గురవుతున్నారని చెప్పారు.