న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఈ నెల 22న 26 మంది పర్యాటకులను బలిగొన్న పాశవిక దాడి ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకడైన ఆదిల్ అహ్మద్ థోకర్ 2018లో చదువుకోవడానికి పాకిస్థాన్‌కు వెళ్లి ఆరేండ్ల తర్వాత మరో ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులతో కలసి కశ్మీర్‌కు తిరిగి వచ్చినట్టు తెలిసింది. 2018లో ఆదిల్ అహ్మద్ స్టూడెంట్ వీసాపై పాకిస్థాన్‌కు వెళ్లాడు. పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన మరుక్షణం అతను తన కుటుంబంతోపాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెంపేసుకున్నాడు. పాక్‌లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాక 2024 చివరిలో అతడు భారత్‌లోకి తిరిగి ప్రవేశించాడు.
అప్పటి నుంచి తన ఉనికిని రహస్యంగా ఉంచాడు. అనేక వారాల పాటు అండర్ గ్రౌండ్‌లోనే దాక్కున్న అదిల్ పాత పరిచయస్థులైన ఉగ్రవాద స్లీపర్ సెల్స్‌తో మళ్లీ సంబంధాలు ఏర్పరుచుకొని ఉంటాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమయంలోనే వార్షిక అమర్నాథ్ యాత్ర కోసం మళ్లీ పర్యాటక ప్రదేశాలు తెరుచుకోవడం మార్చిలో ప్రారంభమైంది. గతంలో భద్రతా కారణాల రీత్యా మూసివేసిన బైసరన్ లోయ కూడా పర్యాటకుల సందర్శనార్థం తెరుచుకుంది. ఇదే అవకాశంగా భావించిన ఆదిల్ అహ్మద్ ఏప్రిల్ 22న ఇతర ఉగ్రవాదులతో కలసి దట్టమైన అడవుల ద్వారా బైసరన్లోకి ప్రవేశించి పర్యాటకులపై విచరక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
ఉగ్ర మూకలను పట్టుకునేందుకు భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించి..ధ్వంసం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వారి స్థావరాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు శ్రీనగర్‌లోని ఉగ్రవాదుల సానుభూతిపరుల ఇండ్లల్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను సైన్యం పేల్చేసింది. చోటిపొరాలో ఎల్ఈటీ కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసం సహా పలువురు ఉగ్రవాదుల ఇండ్లను సైన్యం బాంబులతో కూల్చేసింది.
పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి విషయంలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఉగ్రవాద సంస్థ శనివారం పూర్తిగా యూ-టర్న్ తీసుకుంది. తామే ఈ దాడి చేశామని మొదట్లో ప్రకటించిన ఈ సంస్థ ఇప్పుడు ఇది తమ పని కాదని చెప్తున్నది. అక్కడితో ఆగకుండా భారత్‌పై విపరీతమైన ఆరోపణలు చేసింది. “మా వ్యవస్థలను భారత్ హ్యాక్ చేసి, ఆ మెసేజ్‌ను పోస్ట్ చేసింది. ఇది భారత దేశ సైబర్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌ల పని. దీనిపై మేము పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం.” అని టీఆర్ఎఫ్ తెలిపింది.