న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు ధరల స్థిరీకరణ విధానాన్ని ప్రవేశపెట్టడంతో మంగళవారం ఏవియేషన్ టర్బైన్ ఇంధన (ఏటీఎఫ్) ధరలు సుమారు 10 శాతం పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల్లో వచ్చే భారీ హెచ్చుతగ్గుల నుంచి దేశీయ విమానయాన సంస్థలు, ప్రయాణికులను రక్షించే లక్ష్యంతో దేశీయ విమానయాన సంస్థలకు గరిష్ఠంగా మూడేండ్లపాటు స్థిరమైన ఇంధన ధరలను అందించే విధానాన్ని అమలు చేస్తున్నారు.
దేశీయ విమానయాన సంస్థలకు లీటర్ జెట్ ఇంధన ధర ఇప్పుడు రూ.115కి పెరిగింది. ఇంతకుముందు ఇది రూ.104.927గా ఉండేది. ధరల స్థిరీకరణ పథకంలో పాల్గొనాలని నిర్ణయించుకునే విమానయాన సంస్థలకు ఈ కొత్త ధర గరిష్ఠంగా మూడేండ్లపాటు స్థిరంగా ఉంటుంది.