Maharashtra : మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని గోండా సిటీకి సమీపంలో, మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ హైవేపై నగ్రా గ్రామం వద్ద మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని కిర్నాపూర్, లాంజి తహసీల్ ప్రాంతాలకు చెందిన కొందరు కార్మికులు తమ కుటుంబాలతో కలిసి ఉదయం బొలెరే వాహనంలో తెలంగాణకు బయల్దేరారు.
హైదారాబాద్‌లో వీరంతా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరి వాహనం నగ్రా గ్రామానికి చేరుకోగానే.. హైవేపై ఎదురుగా, వేగంగా వస్తున్న ట్రక్కు బొలెరే వాహనాన్ని ఢీకొంది. ట్రక్కు వేగం ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. అందులో ముగ్గురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్తానికులు పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చే లోగా గ్రామస్తులే సహాయక చర్యలు చేపట్టారు. తర్వాత అధికారులు, పోలీసులతో కలిసి క్షతగాత్రుల్ని బయటకు తీశారు.
చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో బాధితులు నుజ్జునుజ్జయిన కారులోనే చిక్కుకున్నారు. వారిని బయటకు తీసేందుకు కార్‌ను కట్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా ట్రక్కు నడిపిన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.