Bomb threats : ఈ మధ్య కాలంలో ఎయిర్పోర్టులకు, విమానాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబులు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్, కాల్స్ చేసేవారి సంఖ్య పెరిగిపోతున్నది. ఎప్పుడూ ఏదో ఒక చోట బాంబు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ కూడా దేశంలో పలు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
ఒకే రోజు ఏకంగా 20 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం. ఆదివారం (అక్టోబర్ 20) ఒక్కరోజే దేశంలోని 20 విమానాలకు ఆయా విమానాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని పౌరవిమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. బాంబు బెదిరింపు కాల్స్ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఆయా విమానాల్లో తనిఖీలు చేసి బాంబులు లేవని నిర్ధారించినట్లు తెలిపారు.
బెదిరింపు కాల్స్ అందుకున్న విమానాల్లో ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థలకు చెందిన విమానాలు ఉన్నాయని పౌరవిమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన 20 విమానాల్లో ఆరు ఇండిగో విమానాలు, ఆరు విస్తారా, ఆరు ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నట్లు తెలిపారు.