న్యూఢిల్లీ, జూన్ 25 : భారత్‌కు చెందిన శుభాన్షు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లారు. యాక్సియం-4 మిషన్ పేరిట వెళ్లిన ఈ బృందం 14 రోజుల పాటు ఐఎస్ఎస్లో ఉంటారు. సూక్ష్మ గురుత్వాకర్షణశక్తి ఉండే ఐఎస్ఎస్లో వ్యోమగాములు తామున్నన్ని రోజులు ఏమి తింటారు, ఏమి తాగుతారు, ఎట్లా నిద్రపోతారు అన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది. భూమికి సుమారు 400 కిలోమీటర్ల పైన ఉండే ఈ శాస్త్ర పరిశోధనశాల భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. స్పేస్ సిటీగా పిలిచే ఈ స్టేషన్లో వ్యోమగాములు నివసిస్తూ, భూమి మీద చేయలేని ప్రయోగాలను అక్కడ చేస్తుంటారు. ఇక్కడ జీవనం భూమిపైనున్నట్టు ఏమాత్రం ఉండదు. డబ్బాలో ఫ్రీజ్ చేసిన ఆహారాన్ని తినడం, తమ చెటమను, మూత్రాన్ని రీసైకిల్ చేసి తాగడం, గోడకు అమర్చిన బ్యాగుల్లో నిద్రపోవడం, ఫిట్‌గా ఉండేందుకు గంటలకొద్దీ వ్యాయామం చేయడం వీరి రోజువారీ విధి. ఈ స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు కొన్నిసార్లు రోజులు, కొన్నిసార్లు నెలల తరబడి ఉండాల్సి వస్తుంది. ఇటీవల భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇటీవల తాము వెళ్లిన వ్యోమనౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో నెలల తరబడి అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఐఎస్ఎస్ అంతరిక్షంలో నిర్మించిన ఓ భారీ పరిశోధనశాల. ఇది భూమి చుట్టూ తక్కువ ఎత్తులోని కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. పలు దేశాల సహకారంతో అంతరిక్షంలో మానవులు నిర్మించిన అతిపెద్ద నిర్మాణం ఇది. దీని నిర్మాణం 1998లో ప్రారంభం కాగా 2011లో ముగిసింది. ఈ అంతరిక్ష కేంద్రం భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో గంటకు 27,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. ప్రతి 90 నిమిషాలకు ఒకసారి ఇది భూమిని చుట్టి వస్తుంది.
ఈ ఐఎస్ఎస్ ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్ అంత పెద్దగా ఉంటుంది. దీని పొడవు 73 మీటర్లు, వెడల్పు 109 మీటర్లు, ఎత్తు 20 మీటర్లు. ఇక దీని బరువు 420 టన్నులు అనగా 76 నుంచి 187 భారతీయ ఏనుగులంత బరువు. ఇందులో 932 క్యూబిక్ మీటర్ల స్థలం నివాసయోగ్యమైనదిగా ఉంటుంది. అంటే ఓ పెద్ద బంగళా అంత స్థలం అందుబాటులో ఉంటుంది.
ఐఎస్ఎస్ అనేక అధునాతన వ్యవస్థల ద్వారా పనిచేస్తుంది. ఈ వ్యవస్థలన్నీ దానిని ఎప్పుడు క్రియాత్మకంగా, నివాసయోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఐఎస్ఎస్కు విద్యుత్తు సౌరశక్తి ద్వారా లభిస్తుంది. ఇందుకోసం ఐఎస్ఎస్ మీద 2,500 చదరపు మీటర్ల పరిధిలో ఎనిమిది భారీ సౌర ఫలకాలను అమర్చారు. ఈ కేంద్రంలో తగినంత స్థాయిలో జీవవాయువు (ఆక్సిజన్) అందుబాటులో ఉండేందుకు, ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు, నీటి నిర్వహణకు అధునాతన వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఇక్కడ విద్యుద్విశ్లేషణ (ఎలక్ట్రాలిసిస్) ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఇది నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజిస్తుంది. చెమట, మూత్రం, ఇతర తేమను సేకరించి శుద్ధిచేసి తాగునీటిని ఉత్పత్తి చేస్తారు. ఐఎస్ఎస్లోని వ్యోమగాములు ఆ నీటినే తాగుతారు. ఇక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక వడపోత వ్యవస్థలు వ్యోమగాములకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించేందుకుగాను గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ను వేరుచేసి తొలగిస్తాయి. ఈ స్పేస్ స్టేషన్ నిత్యం భూమితో టచ్‌లో ఉంటుంది. ఇందుకు కొన్ని ఉపగ్రహాల నెట్వర్క్, గ్రౌండ్ స్టేషన్లు సహకరిస్తాయి.
ఐఎస్ఎస్ భూమి చుట్టూ అంత వేగంగా తిరిగి రావడానికి రెండు ప్రధాన వ్యవస్థలు పనిచేస్తాయి. ఒకటి ప్రొపల్షన్ సిస్టమ్, రెండోది ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్. రష్యా నిర్మించిన భాగాన్ని రాకెట్ ఇంజిన్లు నడుపుతాయి. హైపర్‌గోలిక్ ఇంధనం, ముఖ్యంగా నైట్రోజన్ టెట్రాక్సైడ్ ద్వారా ఈ ఇంజిన్లు పనిచేస్తాయి. ఇక అమెరికా నిర్మించిన ఐఎస్ఎస్ విభాగం జీనాన్ గ్యాస్‌తో నడిచే అయాన్ థ్రస్టర్లపై ఆధారపడుతుంది. విద్యుత్తును ఉపయోగించి వాయువును అయనీకరణం చేసి ఇంజిన్లను నడిపే శక్తిని ఉత్పత్తి చేస్తారు. వీటికి కార్గో మిషన్ల ద్వారా ఇంధనాన్ని సరఫరా చేస్తారు.
అమెరికా, జపాన్, రష్యా, కెనడా, పలు ఐరోపా దేశాలు సహా మొత్తం 16 దేశాల సాయంతో ఈ అంతరిక్ష కేంద్రంలో పలు మాడ్యూల్స్‌ను నిర్మించారు. ఈ మాడ్యూల్స్ అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. వీటిలో కొన్ని మాడ్యూల్స్ పరిశోధనశాలలుగా ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి అమెరికాకు చెందిన డెస్టినీ, జపాన్‌కు చెందిన కీబో, యూరోపియన్ ల్యాబ్ కొలంబస్, రష్యాకు చెందిన జ్వెజ్డా, పోయిస్క్ ఉన్నాయి. ఇక వ్యోమగాములు నిద్రపోవడానికి ఆరు క్వార్టర్లు, రెండు మరుగుదొడ్లు, ఒక చిన్న జిమ్ కూడా ఉన్నాయి. వ్యోమగాములు బ్యాగులలోకి వెళ్లి చిన్న క్యాబిన్లలో నిద్రపోతారు. గురుత్వాకర్షణ శక్తి లేనందున ఆ బ్యాగులు తేలకుండా ఉండేందుకు వాటిని ఐఎస్ఎస్ గోడలకు బంధించి ఉంచుతారు.
ఐఎస్ఎస్లో ఇంతవరకు మూడువేలకు పైగా పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. ఈ కేంద్రాన్ని ఆరుగురు సిబ్బంది దీర్ఘకాలం నివసించేలా డిజైన్ చేశారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, సిబ్బంది మారే సమయంలో ఇక్కడ ఏడుగురు నుంచి 10 మంది వరకు ఉండాల్సి వస్తుంది. ఇందులో నిద్రపోవడానికి ఆరు క్యాబిన్లు ఉన్నాయి. ఈ కేంద్రంలో సాధారణంగా ఎప్పుడూ అమెరికా, యూరోప్ లేదా జపాన్‌కు చెందిన ముగ్గురు, రష్యాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు ఉంటారు.
ఐఎస్ఎస్లో నివసించే వ్యోమగాములు ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆహారాన్ని తింటారు. ఈ భోజన పదార్థాలు డబ్బాల్లో, ఎండినవి లేదా ఫ్రీజ్ చేసినవై ఉంటాయి. తినేముందు వాటిని వేడి చేస్తారు. సీల్ చేసిన ప్యాకెట్లలోని నీటిని స్ట్రా సాయంతో తాగుతారు. గురుత్వాకర్షణ శక్తి లేనందున గ్లాస్లో నీళ్లు పోసుకొని తాగడం కష్టం. ఉప్పు, కారంను ద్రవరూపంలో అందిస్తారు. ఇక్కడ ఉండే వ్యోమగాములకు స్నానం చేసే అవకాశం ఉండదు. దీంతో వారు షాంపోలో ముంచిన తడి టవల్స్‌తో శరీరాన్ని తుడుచుకుంటారు.