న్యూఢిల్లీ : గాలిలోని అత్యంత సూక్ష్మమైన ధూళి కణాలు (పీఎం2.5) వల్ల ఆస్తమా తీవ్రమవుతున్నది. ముఖ్యంగా నికెల్, వనడియమ్ వంటి లోహాలు, సల్ఫేట్ కణాలు ఈ వ్యాధిని పెంచుతున్నాయి. ఫలితంగా వ్యాధిగ్రస్థులు దవాఖానలలో చేరి, చికిత్స పొందవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. కాలుష్య కారక మిశ్రమం పదో వంతు పెరిగితే, ఆస్తమాతో బాధపడే బాలలు దవాఖానలో చేరవలసిన పరిస్థితి 10.6 శాతం పెరుగుతుంది. 19-64 సంవత్సరాల మధ్య వయస్కులు దవాఖానలో చేరవలసిన పరిస్థితి ఎనిమిది శాతం పెరుగుతుంది. ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్’లో ప్రచురితమైన అధ్యయన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ఎన్విరాన్మెంటల్ ఎపిడమాలజీ ప్రొఫెసర్, ఈ అధ్యయనం ప్రధాన రచయిత జోయెల్ స్వార్ట్జ్ మాట్లాడుతూ, ఆస్తమా పెరగడానికి నికెల్, వనడియమ్, సల్ఫేట్, నైట్రేట్, బ్రోమైన్, అమ్మోనియం కణాలు ప్రధాన కారణాలుగా గుర్తించినట్టు తెలిపారు.
ఆస్తమా వల్ల దవాఖానపాలు కాకుండా తప్పించుకోవాలంటే, వీటిని కట్టుదిట్టంగా నియంత్రించవలసి ఉంటుందని చెప్పారు. చమురు ఇంధనం మండటం వల్ల నికెల్, వనడియం విడుదలవుతాయని, బొగ్గు మండినపుడు సల్ఫేట్లు విడుదలవుతాయని చెప్పారు. వీటిని స్క్రబ్బర్స్, క్లీనర్ ఫ్యూయల్స్ ద్వారా కట్టడి చేయవచ్చునని తెలిపారు. ఆయిల్ నుంచి లోహ అవశేషాలను తొలగించాలని పేర్కొన్నారు. పీఎం2.5లోని ప్రతి పదార్థం ఆస్తమాకు ఏవీ కారణమవుతుందో తమ పరిశోధనలో విశ్లేషించామని చెప్పారు. దవాఖానలో చికిత్స పొందుతున్న 4,69,005 మందిని పరిశీలించి, దవాఖాన బయట ఉష్ణోగ్రతలు, సాంఘిక, ఆర్థిక హోదా వంటివాటిని పరిగణనలోకి తీసుకున్నామన్నారు. టార్గెటెడ్ పొల్యూషన్ కంట్రోల్స్ అవసరమని గుర్తించామని చెప్పారు. నిర్దిష్ట పీఎం 2.5 ధూళి కణాలకు స్వల్ప కాలం గురైనవారిపై ఆస్తమా ప్రభావంపై తదుపరి పరిశోధన అవసరమని తెలిపారు.