హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వాహనాల ఇంధనంలో భారీగా కోత పెట్టినట్టు వెల్లడైంది. దీంతో ప్రజల మధ్య పోలీసుల ప్రత్యక్షత క్రమంగా తగ్గుతూ వస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కో పోలీసు వాహనానికి 220 లీటర్ల వరకు డీజిల్ కోటా నిర్ణయించింది. కాగా ప్రస్తుత ప్రభుత్వం ఆ కోటాను 160 లీటర్లకు తగ్గించినట్టు పెట్రోలింగ్ పోలీసులు చెప్తున్నారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో పోలీసుల ప్రత్యక్షత 100 శాతం ఉండగా, ఇప్పుడు ప్రతి నెల 20వ తేదీ తరువాత రోడ్లపై పోలీసు వాహనాల పెట్రోలింగ్ గణనీయంగా తగ్గిపోతున్నదని అంటున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కో వాహనానికి ఇస్తున్న 160 లీటర్ల కోటా ప్రతినెల 20వ తేదీలోపే అయిపోతున్నదని పెట్రోలింగ్ పోలీసులు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ ఎక్కువగా తిరగాల్సి వస్తే.. 18 రోజులు కూడా వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. కోటా ప్రకారం ఇచ్చిన డీజిల్ అయిపోతే.. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులపైనే ఆధారపడుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పోలీసు వాహనాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కావడం లేదని పేరు చెప్పడం ఇష్టంలేని ఓ అధికారి పేర్కొన్నారు.
పెట్రోలింగ్ కార్లు, బైక్లు, ఇతర వాహనాలన్నీ కలిపి సుమారు నాలుగు వేలకు పైనే ఉన్నా.. ప్రభుత్వం విధించిన ‘కోటా కోత’ కారణంగా 30 శాతం వాహనాలు నిర్వహణ సరిగా లేక కదలలేని స్థితికి చేరుకున్నట్టు తెలిసింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ బిల్లులు, వాహనాల మరమ్మతులు, విడిభాగాల కొనుగోలుకు సంబంధించిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. 6 నెలల బకాయిలు ఉన్నట్టు తెలిసింది.