న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వాహనాలకు ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. డ్రైవర్లు, కార్ల తయారీదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వాడటం వల్ల ముఖ్యంగా పాత వాహనాల పనితీరు మందగిస్తుందని వాదిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుద్ధ ఇంధనంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం రూపొందించిన విధానం ప్రకారం, 20 శాతం ఇథనాల్‌ను కలిపిన ఇంధనాన్ని వాహనాలకు వాడాలి. దీనిని ఈ20 అంటున్నారు. 2025 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశంలో సుమారు 90,000 పెట్రోలు బంకులు ఉన్నాయి. దాదాపు వీటన్నిటిలోనూ ఇథనాల్ కలిపిన ఇంధనమే దొరుకుతున్నది. ఇతర ఇంధనాలు దొరకడం లేదు.
పాత కార్లకు గతంలోని బ్రాండ్లు అయిన ఈ5, ఈ10 ఇంధనాలు సరిగ్గా సరిపోయేవి. ప్రభుత్వం విడుదల చేసే మీడియా ప్రకటనల్లో, ఈ20 వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని చెప్తున్నది. పాత కార్ల ఇంధన సామర్థ్యంపై స్వల్పంగా ప్రభావం పడుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు అంగీకరించింది.ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వాడటంపై కంపెనీలు వాహనదారులకు సరైన సూచనలు ఇవ్వడం లేదు. దీంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ20 విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం వల్ల ఇథనాల్ కలిపిన పెట్రోల్ గురించి వారికి చెప్పడం మానుకున్నామని కొందరు పెట్రోలు బంకు సిబ్బంది చెప్పారు.
పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆగస్టు 8న మాట్లాడుతూ, కొన్ని స్వార్థపర శక్తులు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ అంశంపై పెట్రోలియం శాఖ స్పందిస్తూ, కొన్ని రకాల పాత కార్లలో రబ్బర్ విడిభాగాలు, గాస్కెట్లు మార్చుకోవలసి ఉంటుందని తెలిపారు. ఇది చాలా సులువైన ప్రక్రియ అని చెప్పారు. ఈ ఆందోళనను ఉపశమింపజేయడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. స్కోడా కంపెనీ తన వెబ్సైట్లో ప్రచురించిన వివరాల ప్రకారం, 2020 ఏప్రిల్‌కు ముందు భారత దేశంలో విక్రయించిన తమ కార్ల విడి భాగాలు ఈ20 కోసం మూల్యాంకనం చేసినవి కాదని తెలిపింది.
ఆ తేదీ తర్వాత విక్రయించిన కార్లు పూర్తిగా మెటీరియల్ కేపబుల్ అని పేర్కొంది. పాత కార్ల విషయాన్ని ప్రస్తావించలేదు. టొయోటా కంపెనీ ఇచ్చిన ప్రకటనలో, తమ కార్లలో ఈ20 ఇంధనాన్ని వాడితే, ఇంధన పొదుపులో స్వల్ప తేడా కనిపిస్తుందని చెప్పింది. 2022నాటి రెనాల్ట్ ట్రైబర్ కారు ఈ20 కోసం పరీక్షించలేదని, ఆ ఇంధనాన్ని వాడాలని సలహా ఇవ్వలేమని రెనాల్ట్ కంపెనీ పేర్కొంది. ప్రభుత్వం చేసిన పరీక్షల ఆధారంగా ఈ20 వల్ల పాతకార్లకు తీవ్రమైన సవాళ్లేమీ ఎదురు కాబోవని వివరించింది. కారును ఏ ఇంధనం కోసం తయారు చేశారో దానినే ఇవ్వాలని డ్రైవర్లు పట్టుబడుతున్నారు. 2024 మోడల్ మహీంద్ర స్కార్పియో ఫ్యూయల్ ట్యాంక్ మీద “జాగ్రత్త, పెట్రోలు/ఈ10 ఫ్యూయల్ మాత్రమే” అనే స్టిక్కర్ మహీంద్ర కంపెనీ అతికించింది.