హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్లో(Bengal) తొలి విడతగా 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు(Assembly polling) తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు, గురువారం(ఏప్రిల్ 23) పోలింగ్ ప్రారంభమైంది. నాలుగోసారి అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పోరాడుతుండగా ఈసారైనా బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ పరితపిస్తున్నది. బెంగాల్లో తొలి విడతలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.75 మహిళలు ఉన్నారు.
తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. ఇక్కడ 5.73 మంది ఓటర్లు ఉండగా 2.9కోట్ల మంది మహిళలు, 2.83 మంది పురుషులు ఉన్నారు.
తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉధృతంగా ఎన్నికల ప్రచారం జరిగింది. సంప్రదాయంగా జరిగే ముఖాముఖీ పోటీకి బదులుగా ఇప్పుడు ముక్కోణపు పోటీ ఏర్పడింది. డీఎంకే నేతృత్వంలోని అధికార సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్(ఎస్పీఏ) రెండవ పర్యాయం అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ద్రవిడియన్ మోడల్ పాలనపై తన ప్రచారాన్ని కేంద్రీకరించారు. ఈ కూటమిలో డీఎంకేతోపాటు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే ఉన్నాయి. ఇక ఏఐఏడీఎంకే నేతృత్వంలో బీజేపీతో కలసి ఎన్డీఏ కూటమి తలపడుతున్నది. డీఎంకే ప్రభుత్వంలో అవినీతి, శాంతి భద్రతల పరిస్థితిపై ఎన్డీఏ ఫోకస్ పెట్టింది. ఇక మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే రెండు ప్రధాన కూటములకు గట్టి పోటీని ఇస్తున్నది.
2011 నుంచి అప్రతిహతంగా మూడుసార్లు విజయాన్ని సాధించి నాలుగోసారి అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పోరాడుతుండగా ఈసారి ఎలాగైనా మమత ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నది. అధికార టీఎంసీ ప్రచారం మమత జనాకర్షణ శక్తిపైనే పూర్తిగా ఆధారపడగా బీజేపీకి చెందిన జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు బెంగాల్లో మోహరించి ప్రచారం సాగించారు.