Akshay Kumar | చాలా కాలం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన పాత ఫామ్‌లోకి వచ్చారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఏప్రిల్ 17న విడుదలైన ‘భూత్ బంగ్లా’ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. పెయిడ్ ప్రివ్యూల ద్వారానే రూ. 3.50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, తొలిరోజే రూ. 12.25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించడం విశేషం. వీకెండ్ ముగిసే సరికి దేశవ్యాప్తంగా రూ. 58 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, సోమవారం కొంత మందగించినా మంగళవారం మళ్లీ పుంజుకుని రూ. 8 కోట్లు రాబట్టింది. దీంతో ఐదు రోజుల్లోనే భారతీయ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ. 72.75 కోట్ల నెట్ (రూ. 86.62 కోట్ల గ్రాస్) కలెక్షన్స్‌ను నమోదు చేసింది.
దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్లో కూడా ‘భూత్ బంగ్లా’ మంచి జోరు చూపిస్తోంది. ఐదు రోజుల్లోనే 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసి, ప్రపంచవ్యాప్తంగా రూ. 118 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే రెండో వారాంతానికి రూ. 150 కోట్ల క్లబ్‌లోకి సునాయాసంగా చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రానికి పోటీగా ‘ధురంధర్ 2’ ఉన్నప్పటికీ, ప్రేక్షకులు అక్షయ్ స్టైల్ కామెడీకి పెద్ద పీట వేస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన హిందీ చిత్రాల్లో ‘భూత్ బంగ్లా’ ఇప్పటికే టాప్-3లో చోటు దక్కించుకుంది. షాహిద్ కపూర్, తమన్నా నటించిన ‘ఓ రోమియో’ (రూ. 92 కోట్లు), అలాగే రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో వచ్చిన ‘మర్దానీ 3’ (రూ. 78 కోట్లు) లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను కేవలం ఐదు రోజుల్లోనే అధిగమించడం ఈ చిత్ర విజయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
ఇక హారర్ కామెడీ జానర్లో సంచలనం సృష్టించిన వరుణ్ ధావన్ నటించిన ‘భేడియా’ (రూ. 90 కోట్లు) రికార్డును కూడా ఈ చిత్రం దాటేసింది. త్వరలోనే ‘ముంజ్యా’ (రూ. 132 కోట్లు) కలెక్షన్స్‌పై కన్నేసింది. అలాగే ‘స్త్రీ’, ‘భూల్ భూలయ్యా 2’ వంటి సూపర్ హిట్ చిత్రాల సరసన నిలవడానికి సిద్ధమవుతోంది.దర్శకుడు ప్రియదర్శన్, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో సినిమా వచ్చి దాదాపు 14 సంవత్సరాలు అవుతోంది. గతంలో ‘భూల్ భూలయ్యా’ వంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన ఈ జోడీ, ఇప్పుడు ‘భూత్ బంగ్లా’తో మరోసారి మేజిక్‌ను రిపీట్ చేసింది. ఈ చిత్రంలో టబు, వామికా గబ్బి కీలక పాత్రల్లో మెప్పించగా, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్‌ల కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలం అయ్యింది. హారర్ ఎలిమెంట్స్‌కు వింటేజ్ కామెడీ జోడవడంతో ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.మొత్తంగా, అక్షయ్ కుమార్‌కు ఈ చిత్రం బలమైన కమ్‌బ్యాక్‌గా నిలుస్తోంది. వరుస ఫ్లాప్స్ తర్వాత మంచి విజయాన్ని అందుకోవడం ఆయన కెరీర్‌కు పెద్ద బూస్ట్‌గా మారింది.