Assembly Elections : దేశంలో ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిలకు జరుగుతూనే ఉంటాయి. ఒక పార్టీ స్థానంలో ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది సహజంగా జరిగేదే. అయితే, ఈసారి జరిగిన ఎన్నికలు మాత్రం చాలా భిన్నమైనవి. కరెక్టుగా చెప్పాలంటే ఇవి దేశ రాజకీయాల్ని మార్చే ఎన్నికలు.
ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు దేశంలో కొత్త రాజకీయ లక్ష్యాలకు దారి చూపాయి. ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో రెండింట్లో ఇంతకుముందు అధికారంలో ఉన్న బీజేపీ కూటమే గెలిచింది. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. అయితే, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మాత్రం కొత్త చరిత్ర లిఖించుకున్నాయి. ఈ మూడు చోట్లా అధికార పార్టీలు ఓటమి పాలయ్యాయి. అంతకుమించిన కీలక పరిణామాలివి.
బెంగాల్లో మొదటిసారి అధికారంలోకి బీజేపీ
పశ్చిమ బెంగాల్‌ను 15 ఏళ్లపాటు పాలించిన మమతా బెనర్జీ పాలనకు బీజేపీ తెరదించింది. బెంగాల్లో మొదటిసారిగా బీజేపీ అధికారం చేపట్టబోతుంది. బెంగాల్‌ను ఎక్కువగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఎంసీ పాలించింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులను మమతా బెనర్జీ తుడిపేసింది. ఇప్పుడు మమత ఆధ్వర్యంలోని టీఎంసీని బీజేపీ ఓడించింది. బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో టీఎంసీ పుంజుకోవడానికి ఇప్పట్లో అవకాశాలు చాలా తక్కువే. ఒక కొత్త రాష్ట్రంలో బీజేపీ తొలిసారి అధికారం చేపట్టి చరిత్ర సృష్టించింది.
తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే పాలనకు తెర
తమిళనాడులో కూడా ఇలాంటి పరిస్థితే సంభవించింది. ఈ రాష్ట్రాన్ని దశాబ్దాలుగా పాలించిన డీఎంకే, ఏఐఏడీఎంకే కూటమి పార్టీలకు ఒకేసారి చెక్ పెట్టేశారు టీవీకే అధినేత, నటుడు విజయ్. ఈ రెండు పార్టీల పాలనకు నేటితో తెరపడింది. తమిళనాట ఒక కొత్త రాజకీయ శక్తి ఉద్భవించింది. తమిళనాట సినీ స్టార్లకు ఎలాంటి ఆదరణ ఉంటుందో మరోసారి విజయ్ నిరూపించారు. ముక్కోణపు పోరులో విజయ్ విజయం సాధించారు. తమిళనాడులో సాధారణంగా డీఎంకే, ఏఐఏడీఎంకే కూటముల మధ్యే పోటీ ఉంటుంది. ఇవి రెండూ ప్రాంతీయ పార్టీలు. అందులోనూ ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబించే పార్టీలు. అందువల్ల జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడ స్థానం లేదు. పొత్తులో భాగంగా కొన్ని సీట్లతో సర్దుకోవాల్సిందే. అలాంటిచోట విజయ్ ఘన విజయం సాధించాడు.
దేశంలో కమ్యూనిస్టుల పాలనకు ఎండ్ కార్డ్
తాజా ఎన్నికల్లో కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం ఇదే. దేశలో నేటితో కమ్యూనిస్టుల పాలన అంతమైనట్లే. గతంలో వివిధ రాష్ట్రాల్లో బలంగా ఉన్న సీపీఎం, సీపీఐ వంటి కమ్యూనిస్టు పార్టీలు క్రమంగా తమ ఉనికి కోల్పోతూ వచ్చాయి. గతంలో పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉండేది. అక్కడ పార్టీ ఉనికి కోల్పోయింది. చివరగా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళంలో ఇప్పుడు ఎల్డీఎఫ్ కూటమి ఓడిపోయింది. అంటే, ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనూ కమ్యూనిస్టు పార్టీ అధికారంలో లేదు. కేంద్రంలో ఎలాగూ కమ్యూనిస్టులకు అవకాశం లేదు.
కొన్ని రాష్ట్రాల్లో వేరే పార్టీలతో పొత్తు వల్ల వివిధ అసెంబ్లీలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు మాత్రం ఉన్నాయి. 1951–52 కాలంలో కమ్యూనిస్టులు లోక్‌సభలో బలమైన ప్రతిపక్షంగా ఉండేవారు. ఆ తర్వాత కేరళంలో 1957లో, పశ్చిమ బెంగాల్లో 1977లో అధికారంలో ఉండేవారు. 2026 నాటికి ఎక్కడా అధికారం లేకుండా ప్రజలకు దూరమయ్యారు. కమ్యూనిస్టుల తరఫున చివరి సీఎంగా పినరయి విజయన్ నిలుస్తారు.