హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : టెస్సెరాక్ట్ భూ కుంభకోణంపై వెంటనే విచారణ జరిపించాలని లోకాయుక్తను బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం శుక్రవారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సంజయ్ కల్వకుంట్ల, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్, పార్టీ లీగల్‌సెల్ బాధ్యులు లలితారెడ్డి, విశ్వేశ్వర్, కల్యాణ్‌తో కూడిన ప్రతినిధుల బృందం లోకాయుక్తను కలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ అనే బినామీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.200కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేసినట్టు 3 కీలక ఆధారాలతో ఫిర్యాదు చేశారు. కర్ణాటకలో ముడా కుంభకోణం తరహాలోనే టెస్సెరాక్ట్ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని, సీఎం ప్రమేయంపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
1) కొండల్‌రెడ్డి చైర్మన్‌గా అధికారిక ప్రకటనలు, టెస్సెరాక్ట్ ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ ఉత్పత్తుల తయారీ కెపాసిటీ కలిగినట్టు తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్‌లో పొందుపరిచారు. కంపెనీ చైర్మన్ హోదాలో యూస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం, ఎస్-ఇండియా స్ట్రాటజిక్ అమెరికా కాంగ్రెషనల్ స్టాఫ్ డెలిగేషన్ రౌండ్‌టేబుల్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
2) జూన్ 2025లో భూ కేటాయింపులకు ఐదు నెలల ముందే సీఎం తమ్ముడి కొడుకు అనుముల నయన్రెడ్డి టెస్సెరాక్ట్కు జనవరి 2025 నుంచి సీఈవోగా వ్యవహరిస్తున్నట్టు తన వెరిఫైడ్ ఫ్రొఫైల్లో ప్రకటించుకున్నారు.
3) ఏరోస్పేస్, డిఫెన్స్ ప్రెషిషన్ తయారీ, ఫోర్జింగ్, కాస్టింగ్ చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కంపెనీ చిన్న గోడౌన్లో ఏర్పాటు చేసినట్టు తే లింది. రిజిస్టర్డ్ కార్యాలయం ప్రసూమా నిల యం అనే చిన్న నివాస అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో కొనసాగుతున్నది. ఇది ఎలాంటి పారిశ్రామిక/ వాణిజ్య సంస్థ కాదు.
4) 2025 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ సమర్పించిన వార్షిక నివేదిక ప్రకారం కంపెనీలో పురుష, మహిళలు, ట్రాన్స్‌జెండర్ ఏ ఒక్క ఉద్యోగి లేరనే విషయం బట్టబయలైంది.
5) తమ వద్ద అత్యాధునిక ప్లాంట్లు, సిబ్బంది ఉన్నట్టు చూపేందుకు ఈయూకు చెందిన యూరోపియన్ కోర్ట్ ఆఫ్ ఆడిటర్స్ అధికారిక వెబ్సైట్ బ్యానర్ ఫొటోలను టెస్సెరాక్ట్ కంపెనీ వెబ్సైట్లో పెట్టి తప్పుదోవ పట్టించారు.
6) కంపెనీ వెబ్సైట్లో +1 2345 6789’ అనే ఫేక్ ప్లేస్ హోల్డర్ నంబర్ ఉండగా, కేటీఆర్ ఆధారాలతో బయటపెట్టడంతో నంబర్‌ను మార్చేశారు.
7) రంగారెడ్డి జిల్లా రావిర్యాల నాన్ సెజ్ ఈ సిటీలో మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.135 కోట్ల నుంచి రూ. 200 కోట్ల విలువైన సుమారు ఐదెకరాలను టెండర్లు పిలువకుండా, పోటీలేకుండా చదరపు మీటరుకు కేవలం రూ. 3,707 చొప్పున రూ. 7 కోట్ల నుంచి రూ. 7.5 కోట్లకు కట్టబెట్టారు.
8) కంపెనీ ఆర్థిక నివేదికల ప్రకారం మూలధనం కేవలం రూ. లక్ష మాత్రమే.
9) 2023-24లో జీరోగా ఉన్న విదేశీ మారక ఆదాయం 2024-25 నాటికి రూ. 1,06, 07,621గా నమోదైంది. అయితే విదేశీ కరెన్సీలో ఎలాంటి ఖర్చు, అనుబంధ సంస్థలు/జేవీలు లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
10) కొండల్‌రెడ్డి గ్లోబల్ వేదికలపై చైర్మన్‌గా చలామణి అవుతున్నారు..కానీ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డుల్లో మాత్రం ఆయన పేరు లేకుండా నరేశ్బొట్ట, కంద్ర రాశి, సీ శేషసాయిరెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి పేర్లు డైరెక్టర్లుగా ఉన్నాయి. నిజమైన లబ్ధిదారుడిని కాపాడేందుకు సృష్టించిన ఈ నిర్మాణం బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం-1988 కింద తీవ్రమైన నేరం.
11) అధికారంలో ఉన్నవారు బంధుప్రీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడరాదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టంచేసింది.