Assembly bye-elections : అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి. ఇవాళ కౌంటింగ్ నిర్వహించారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు. కానీ ఉత్తరాఖండ్‌లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అదేవిధంగా బీహార్‌లో ఉప ఎన్నిక జరిగిన ఏకైక అసెంబ్లీ స్థానాన్ని కూడా అధికార ఎన్డీఏ కూటమి నిలబెట్టుకోలేకపోయింది.
పశ్చిమబెంగాల్లో రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగ్దా, మనిక్తలా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగగా మొత్తం నాలుగు స్థానాలను అధికార టీఎంసీ కైవసం చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా రెండు చోట్ల అధికార కాంగ్రెస్, ఒక స్థానంలో ప్రతిపక్ష బీజేపీ గెలిచాయి. దేహ్రా, నాలాగఢ్లలో కాంగ్రెస్ గెలువగా.. హమీర్పూర్ స్థానంలో బీజేపీ నెగ్గింది.
ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్, మంగ్లౌర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా రెండు స్థానాల్లోనూ అధికార బీజేపీ ఓటమి పాలైంది. ఆ రెండు చోట్లా ప్రతిపక్ష కాంగ్రెస్ విజయం సాధించింది. పంజాబ్‌లో ఉప ఎన్నిక జరిగిన ఏకైక నియోజకవర్గం జలంధర్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. తమిళనాడులో ఉప ఎన్నిక జరిగిన ఏకైక స్థానం విక్రవందిలో అధికార డీఎంకే గెలిచింది.
మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నిక జరిగిన అమర్‌వార నియోజకవర్గంలో కూడా అధికార బీజేపీ నెగ్గింది. బీహార్‌లోని రూపౌలీ నియోజకవర్గంలో మాత్రం ప్రజలు ఏ పార్టీని నమ్మలేదు. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించారు. మొత్తంగా 13 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 4, టీఎంసీ 4, బీజేపీ 2, ఆప్ 1, డీఎంకే 1, ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించారు.