Himanta Biswa Sarma : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో హిమంత శర్మ సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాహుల్‌పై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ చైనాకు ప్రాధాన్యత ఇస్తారని మండిపడ్డారు. భారత్‌ను అణగదొక్కి చైనాను గొప్ప దేశంగా ఆయన కీర్తిస్తుంటారని దుయ్యబట్టారు.
చైనాలో ప్రజాస్వామ్యం లేదని, మత స్వేచ్ఛ లేదని రాహుల్ గాంధీ ఇదే విషయం ప్రజలకు చెబుతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మధ్య కుదిరిన ఒప్పందాన్ని బయటపెట్టాలని హిమంత శర్మ డిమాండ్ చేశారు. కాగా, రాహుల్ గాంధీ టెక్సాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆరెస్సెస్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.
యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో భారత సంతతికి చెందిన వారిని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ భారత్ ఒకే ఆలోచనకు సంబంధించిందని ఆరెస్సెస్ భావిస్తుందని, కానీ తాము భారత్ విభిన్న ఆలోచనలకు వేదికగా భావిస్తామని చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ దాడికి తెగబడుతున్నారని ప్రజలు గ్రహించడంతో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా బలమైన పోరాటం జరిగిందని గుర్తుచేశారు.
Read More :
Sanatan Pradhan | పేదరికాన్ని ఓడించిన సంకల్పం.. నీట్లో సత్తా చాటిన ఒడిశా గిరిజన విద్యార్థి