Sanatan Pradhan | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఖరీదైన కాలేజీల్లో చదువుతూ కోచింగ్‌కు లక్షలకు లక్షలు ఫీజులు కడుతున్న చాలామందికి ఆ గిరిజన యువకుడు ఆదర్శంగా నిలిచాడు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాకు చెందిన సనాతన్ ప్రధాన్‌ది అత్యంత పేద కుటుంబం. పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులుండేవి కాదు. ఇక అతడి గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం డాక్టర్ కావాలన్న తన కలను తొలి ప్రయత్నంలోనే నెరవేర్చుకున్నాడు. ఏటా లక్షలాది మంది హాజరయ్యే జాతీయ వైద్య విద్య అర్హత ప్రవేశ పరీక్ష – నీట్లో మంచి ర్యాంకును తెచ్చుకుని ఎంకేసీజీ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో సీట్ పొందాడు. అతని తండ్రి కనేశ్వర్ ప్రధాని తడిమహ గ్రామంలో చిన్న రైతు. పదో తరగతి వరకు డారింగ్బడిలో చదువుకున్న సనాతన్, ఇంటర్‌ను బెర్హంపుర్లోని జూనియర్ కాలేజీలో పూర్తి చేశాడు.
వైద్య విద్య ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు కోచింగ్ తీసుకుందామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో తన ఊరు వచ్చేసి సొంతంగా ప్రిపేరవ్వడం ప్రారంభించాడు. అయితే ఆ గ్రామంలో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో నాలుగు కి.మీ నడిచి వెళ్లి కొండలపైకి ఎక్కి అక్కడ చదువుకునేవాడు. రోజంతా అక్కడే గడిపేవాడు. చివరకు పరీక్షల ముందు బెర్హంపూర్ వెళ్లి, స్నేహితుల నుంచి పుస్తకాలు తీసుకుని పరీక్షకు సిద్ధమై నీట్లో విజయం సాధించాడు. తన సీట్ పొందేందుకు అప్పు చేసి డబ్బును డిపాజిట్ చేసినట్టు సనాతన్ తెలిపాడు. కాగా, సనాతన్‌ను గ్రామస్థులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఒడిశాకే చెందిన మరో ఇద్దరు పేద గిరిజన విద్యార్థులు నీట్లో మంచి ర్యాంక్ సాధించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: జనజీవనం, రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ను ఏరివేయడానికి కేంద్రం కంకణం కట్టుకుంది. 2026 నాటికి దేశంలో మావోయిస్టుల సమస్య లేకుండా చేయాలని లక్ష్యంగా నిర్ణయించిన కేంద్రం అందులో భాగంగా మావోలపై వ్యూహాత్మకంగా నిర్ణయాత్మక యుద్ధానికి దిగుతున్నది. ఈ క్రమంలో నక్సల్స్ ప్రభావం అధికంగా ఉండే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాకు పెద్దయెత్తున సీఆర్పీఎఫ్ బలగాలను తరలిస్తున్నది. 4,000 మంది జవాన్లతో కూడిన నాలుగు బృందాలు నక్సల్స్ ఏరివేతకు ముందుకు కదులుతున్నాయి. వీటిలో మూడు జార్ఖండ్ నుంచి, ఒకటి బీహార్ నుంచి రప్పించారు. ప్రస్తుతం మావోల వేట కొనసాగిస్తున్న బలగాలకు ఇవి అదనం. ఇందులో రెండు బృందాలను దంతెవాడ, సుక్మా జిల్లాల్లో ఏర్పాటు చేశారు. మిగిలిన వారిని ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలను కలిపే మూడు రోడ్ల జంక్షన్లు, ఇతర ప్రదేశాల వద్ద మోహరిస్తారు.