లఖింపూర్ ఖీరీ, జనవరి 3: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో గతేడాది అక్టోబర్‌లో రైతులను కార్లతో తొక్కించి చంపిన సమయంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారులోనే ఉన్నాడని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వెల్లడించింది. లఖింపూర్ ఘటనపై 5 వేల పేజీల అభియోగ పత్రాన్ని స్థానిక కోర్టుకు సమర్పించింది. ఆశిష్ మిశ్రా సహా 14 మందిని నిందితులుగా చేర్చింది. ఘటన జరిగిన సమయంలో తన కొడుకు ఆశిష్ అక్కడ లేడని అజయ్ మిశ్రా చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశారు. చార్జ్‌షీట్‌లో వీరేంద్ర శుక్లా పేరును కొత్తగా చేర్చినట్టు అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబర్ 3న లఖింపూర్‌లో రైతుల మీదకు ఆశిష్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లింది. ఘటనలో నలుగురు రైతులు, అనంతరం చెలరేగిన హింస లో విలేకరి సహా మరో నలుగురు చనిపోయారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన సిట్.. ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, పక్కా పథకం ప్రకారమే రైతులను చంపారని గత నెలలో కోర్టుకు తెలిపింది. ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టు అలహాబాద్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ చింతా రామ్‌ను నియమించింది.