తిరువనంతపురం: కేరళలో ఆశా వర్కర్లు తమ నిరసనను కొత్త స్థాయికి తీసుకెళ్లారు. తిరువనంతపురంలోని సెక్రటేరియేట్ ముందు ఇవాళ వాళ్లు శిరోముండనం చేసుకున్నారు. ప్రభుత్వ నిర్లిప్తతను ఖండిస్తూ జట్టును కత్తిరించుకున్నారు. రోజువారి గౌరవ వేతనాన్ని పెంచాలని, పోస్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు. ఇవాళ్టితో వాళ్ల ఆందోళన 50వ రోజుకు చేరుకున్నది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్(ఆశా) వర్కర్లు కేరళలో కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకితను, సంఘీభావాన్ని ప్రకటించారు. కొందరు మహిళలు తమ జత్తును కత్తిరించుకోగా, మరికొందరు ఏకంగా గుండు గీయించుకున్నారు. ఆ శిరోజాలతో సెక్రటేరియేట్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు.
ప్రభుత్వం తమను విస్మరిస్తోందని, తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోందని, రోజుకు కేవలం 232 రూపాయలతో ఎలా బ్రతకగలమని ఆశా వర్కర్లు ప్రశ్నించారు. ప్రభుత్వం తమను పట్టించుకోకుంటే, ఇక్కడే ప్రాణాలు వదిలేస్తామని ఆశా వర్కర్లు నినదించారు. భావోద్వేగం తామేమీ ఉద్యమం చేయడం లేదని, ఇది బలమైన సందేశమని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని, ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. తిరువనంతపురంతో పాటు అలప్పుజా, అంగమలే ప్రాంతాల్లో కూడా ఆశా వర్కర్లు తమ నెత్తి కత్తిరించుకున్నారు.