లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏఐఎంఐఎం సన్నద్ధమవుతోంది. ఈనెల 7న అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రారంభిస్తారని పార్టీ యూపీ అధ్యక్షుడు షౌకత్ అలీ వెల్లడించారు. అయోధ్యలోని రుదౌలిలో వచ్చే మంగళవారం జరిగే బహిరంగ సభలో ఓవైసీ ప్రసంగిస్తారని చెప్పారు.
ఈ సభకు హిందువులు, ముస్లింలు, దళితులు, బీసీలను ఆహ్వానించామని తెలిపారు. కేంద్రం, యూపీలోని పాలక బీజేపీ హయాంలో ముస్లింలే కాకుండా అన్ని కులాలు, వర్గాల ప్రజలు వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ అణిచివేతకు గురైన వర్గాల హక్కుల కోసం పోరాడేందుకు యూపీ అంతటా వంచిత్-షోషిత్ సమాజ్ సభలను నిర్వహించాలని ఏఐఎంఐఎం నిర్ణయించిందని తెలిపారు. ఇక అయోధ్య సభ అనంతరం ఓవైసీ ఈనెల 8, 9 తేదీల్లో సుల్తాన్పూర్, బారబంకిలో జరిగే సభల్లోనూ పాల్గొంటారని ఏఐఎంఐఎం నేత వెల్లడించారు.