Asaduddin Owaisi : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాంలో ఉగ్రదాదుల దాడి (Terror attack) తర్వాత పాకిస్థాన్‌కు గట్టి సమాధానం చెప్పే అవకాశం వచ్చిందని, కానీ ఆ అవకాశాన్ని భారత ప్రభుత్వం జారవిడుచుకుందని ఏఐఎంఐఎం చీఫ్ (AIMIM chief) అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. పాకిస్థాన్ ఉగ్రచర్యకు గట్టి ప్రతీకారం తీర్చుకోవాలనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉందని చెప్పారు.
అయితే పహల్గాం ఉగ్రదాడి అనంతరం చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌ను కేంద్రం ముగించడంతో మంచి అవకాశాన్ని జారవిడుచుకుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మీడియా.. ‘మీరు ప్రధాని అయి ఉంటే ఏం చేసేవారు..?’ అని ప్రశ్నించింది. అందుకు అసదుద్దీన్ సమాధానం చెబుతూ.. ‘వాస్తవానికి అనుగుణంగానే వ్యవహరించేవాడిని. మా లక్ష్యం కేవలం అధికారంలో కూర్చోవడం, మంత్రులు కావడం కాదు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం గట్టి సమాధానం చెప్పే మంచి అవకాశాన్ని మనం జారవిడుచుకున్నామని ఒక భారతీయుడిగా నేను గట్టిగా చెప్పగలను’ అన్నారు.
ఆపరేషన్ ఎందుకు ఆపేశారని ప్రశ్నించగా.. ‘ఎందుకు ఆపేశారో నిజంగా నాకు తెలియదు. యుద్ధం తరహా పరిస్థితి నెలకొంది. అకస్మాత్తుగా ఆపరేషన్ ఆపేశారు. నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యా. యావద్దేశం నిర్ణయాత్మక స్పందన తెలియజేసేందుకు రెడీగా ఉంది. పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పాలని కోరుకుంది. మళ్లీ అలాంటి అవకాశం రాదు. ప్రభుత్వం మంచి అవకాశాన్ని వదులుకుంది. ఇప్పుడు కేవలం పార్లమెంటులో కూర్చుని, పీఓకేను ఎలా తిరిగి రాబట్టుకోవాలనే దానిపై మాట్లాడుకోవాలి’ అని ఒవైసీ చెప్పారు.