తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో కూడా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. (Rahul Gandhi) అయితే ఆయన ఇప్పటికే పోటీ చేసిన కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ప్రజలు దీనిపై మిశ్రమంగా స్పందించారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో కూడా పోటీ చేయడంలో తప్పేమీ లేదని కొందరు అన్నారు. అయితే రెండు స్థానాల్లో ఆయన గెలిస్తే, వాయనాడ్ సీటు ఖాళీ చేసే అవకాశం ఉందని మరి కొందరు తెలిపారు. రాహుల్ గాంధీ అలా చేసిన పక్షంలో వాయనాడ్ ప్రజలకు మంచిది కాదన్నారు.
కాగా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) నాయకుడు పీకే కున్హాలికుట్టి, రాహుల్ గాంధీ నిర్ణయాన్ని సమర్థించారు. రాయ్‌బరేలీ నుంచి ఆయన పోటీ చేయడంలో ఎలాంటి తప్పులేదని అన్నారు. ఈ నిర్ణయం ఇండియా బ్లాక్‌కు ఊతమిస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ గతంలో రెండు స్థానాల నుంచి పోటీ చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది. సీపీఐ నేత అన్నీ రాజా, కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్‌తో రాహుల్ గాంధీ పోటీ పడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వాయనాడ్ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానంలో ఓడిపోయారు. అయితే ఈసారి వాయనాడ్‌తోపాటు రాయ్‌బరేలీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.