న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi elections) అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్ని సీట్లలో గెలుస్తుందో అన్నది ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అంచనా వేశారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను తమ పార్టీ 55 సీట్లలో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. అయితే మహిళా ఓటర్లు పూర్తిగా చొరవ చూపితే 60 సీట్లు దాటే అవకాశం ఉందని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా, సోమవారం కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ‘నా తల్లులు, సోదరీమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీలో ఏమీ లేదని కుటుంబాల్లోని మగ వారిని ఒప్పించండి. ఇది ధనవంతుల పార్టీ. కేజ్రీవాల్ మాత్రమే ఉపయోగంగా ఉంటారు’ అని అన్నారు. ‘ఈ ఎన్నికలు మహిళలవే. మహిళలు సహకరిస్తే, మనం 60 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు సోమవారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి రావాలని ఆప్ భావిస్తున్నది. అయితే బీజేపీ గట్టి పోటీ ఇస్తుండగా కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచింది.
కాగా, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 62 సీట్లతో ఆప్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. బీజేజీ 8 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ ఖాతా తెరువలేకపోయింది. 2015 ఎన్నికల్లో ఆప్ 67 సీట్లను కైవసం చేసుకుని తొలిసారి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది.
मेरे अनुमान के मुताबिक आम आदमी पार्टी की 55 सीट आ रही हैं लेकिन अगर महिलाएं ज़ोर लगा दें – सभी वोट करने जायें और अपने घर के पुरुषों को भी आम आदमी पार्टी को वोट देने के लिए समझायें – तो 60 से ज़्यादा भी आ सकती हैं।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 3, 2025